కేటీఆర్ అరెస్ట్ అవుతారు: వేణుస్వామి
సినీరంగంలోని సెలబ్రిటీలకు, రాజకీయ రంగంలోని సెలబ్రిటీలకు వ్యక్తిగత జాతకాలు చెప్పే వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. వాస్తవానికి ఆయన కూడా వీరందరి జాతకాలు చెప్పి ఒక సెలబ్రిటీలా మారిపోయారు. రాజకీయ రంగంలోకానీ, సినీ రంగంలోకానీ ఏ సమయంలో ఎలా ఎవరికి ఏ జాతకం చెబితే తాను వార్తల్లో నిలుస్తాను అనే విషయాన్ని ఆయన గట్టిగా పట్టుకున్నారు. ఆ ప్రకారమే సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియోలు విడుదల చేస్తుంటారు.
తాజాగా ఆయన తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ గురించి వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన చెప్పిన జ్యోతిష్యంపై భారత రాష్ట్ర సమితి నాయకులు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కేటీఆర్ అరెస్ట్ అవుతారని ఆయన గతంలోనే చెప్పారు. ఇటీవలే ఓ కార్యక్రమంలో పాల్గొన్న వేణుస్వామి మరోసారి ఈ విషయాన్ని గుర్తుచేశారు. ఈ సంవత్సరం కేటీఆర్ తప్పకుండా అరెస్ట్ అవుతారని చెప్పారు. అయితే ఆయన్ను ఏ కేసులో అరెస్ట్ చేస్తారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.

కేటీఆర్ జైలుకు వెళ్లడం పక్కా#AmulBabyKTR pic.twitter.com/lIrMflwgle
— Aapanna Hastham (@AapannaHastham) April 11, 2024
తాజాగా ఆయన చెప్పిన జ్యోతిష్యం బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్ పెంచింది. కేటీఆర్ కూడా అరెస్ట్ అయితే పార్టీ పరిస్థితి కష్టంగా మారుతుందంటున్నారు. లోక్ సభ ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయని, కీలక నేతలంతా కష్టకాలంలో బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారని, ఈ తరుణంలో వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయంటున్నారు.
అయితే వేణుస్వామి చెబుతున్న జోస్యం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. కాంగ్రెస్ పేరుతో కొన్ని సామాజిక మాధ్యమ ఖాతాలు కూడా వేణుస్వామి వీడియోను షేర్ చేస్తూ గులాబీ శ్రేణులను ఆత్మరక్షణ ధోరణిలోకి నెట్టేస్తున్నాయి.












Click it and Unblock the Notifications