బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిపై గొడ్డలితో దాడికి యత్నం: అడ్డుకున్న అనుచరుడికి తీవ్రగాయాలు (వీడియో)
నల్గొండ: సూర్యపేట జిల్లాలోని ఆత్మకూరు(ఎస్) మండలం గట్టికల్లు గ్రామంలో బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆదివారం రాత్రి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి వట్టే జానయ్యపై హత్యాయత్నం జరిగింది. జానయ్య ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో మరో పార్టీకి చెందిన ఓ నేత ఆయనపై గొడ్డలితో దాడికి యత్నించాడు.
ఈ క్రమంలో అడ్డువచ్చిన జానయ్య అనుచరులపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడి ఘటనలో జానయ్య తృటిలో తప్పించుకున్నారు. దాడి ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. సూర్యాపేట అధికార పార్టీ ఎమ్మెల్యే, మంత్రి జగదీశ్ రెడ్డి అనుచరులు, బంధువులే ఈ దాడికి పాల్పడ్డారని బీఎస్పీ నేతలు ఆరోపిస్తున్నారు.

దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని బీఎస్పీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
గొడ్డళ్లు, కత్తులతో వట్టే జానయ్య యాదవ్ పై బిఆర్ఎస్ నాయకులు దాడి
— Vatte Janaiah Yadav (@VatteJanaiah) November 19, 2023
తృటిలో తప్పిన ప్రమాదం
బి ఎస్ పి కార్యకర్తకు తీవ్ర గాయాలు
మంత్రి బందువే గొడవకు కారణం
గట్టికల్ గ్రామంలో ఉద్రుక్తత వాతావరణం@RSPraveenSwaero @bsp_ts @BSP4Telangana @BITCELL_BSP pic.twitter.com/ufdC1eLhQp
గెలుపు తమదేనంటూ ప్రవీణ్ కుమార్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దొరల గడీలను కూలుస్తామన్నారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఎస్పీ పార్టీ రాజ్యాధికార సభ వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. ఈ సభలో ప్రవీణ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. వికారాబాద్ గడ్డపై ఎందరినో గెలిపించారు కానీ.. వికారాబాద్ అభివృద్ధికి ఎందుకు నోచుకోలేదో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ ప్రభుత్వం.. ఉద్యోగులు, పోలీసులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని విమర్శించారు.
నవంబర్ 30న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు గువ్వ గుయ్యమనే విధంగా బీఎస్పీకి ఓట్లు వేయాలన్నారు. అన్ని కులాలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన పార్టీ బీఎస్పీనేనని అన్నారు. బీఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తే ఐదు లక్షల మందికి ఉద్యోగాలిస్తామని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మొద్దన్నారు. కేసీఆర్ ను ఈ ఎన్నికల్లో గద్దె దించాలన్నారు.












Click it and Unblock the Notifications