ఆటో డ్రైవర్ హల్‌చల్: స్కూటీపై వెళ్తున్న అమ్మాయిలకు వేధింపు
హైదరాబాద్: రాజ్ భవన్ వద్ద ఓ ఆటో డ్రైవర్ సోమవారం నాడు హల్‌చల్ చేశాడు. తప్పతాగి రోడ్డుమీద వెళ్లే వారిని దుర్భాషాలాడాడు. అతను స్కూటీ పైన వెళ్తున్న ముగ్గురు యువతులతో అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు డ్రైవర్ పేరు కరుణాకర్ అని తెలుస్తోంది.
ఆ అమ్మాయిలను తిట్టాడు. దీంతో, స్కూటీ పైన అమ్మాయిలు అతని ఆటోను ఓవర్ టేక్ చేశారు. స్థానికుల సహాయంతో అతనిని పట్టుకున్నారు. వెంటనే పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించారు. అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆటోకు సంబంధించిన కాగితాలు, డ్రైవింగ్ లైసెన్స్ తదితరాలు డ్రైవర్ నుంచి తీసుకున్నారు. మద్యం మత్తులోనే అతను అమ్మాయిలతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడని చెబుతున్నారు.

బ్యాంకులో చోరీకి యత్నించిన దొంగ అరెస్ట్
రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట ఆంధ్రా బ్యాంకులో దొంగతనం చేసేందుకు ఓ దొంగ యత్నించాడు. అతను అడ్డంగా దొరికిపోయాడు. బ్యాంక్‌కు వెనుకాల ఉన్న కిటికీని తొలగించి దొంగ లోపలికి ప్రవేశించాడు. బ్యాంకులో శబ్దం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు దొంగను అరెస్టు చేశారు. దొంగను పోలీసులు విచారిస్తున్నారు.
రైతు ఆత్మహత్య
నల్గొండ జిల్లా భువనగిరి మండలం మన్నెవారి వంపు గ్రామంలో ఉరివేసుకొని రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐలయ్య వ్యవసాయం కోసం దాదాపు 2 లక్షల రూపాయలు అప్పు చేశాడు. సంవత్సరం క్రితం అప్పు చేసిన డబ్బుతో రెండు బోర్లు వేశాడు. నీరు పడలేదు.
దీంతో, అర ఎకరంలోనే సాగు చేస్తూ జీవిస్తున్నాడు. అప్పు ఇచ్చిన వారు కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. దీంతో, దిక్కుతోచని స్థితిలో తమకు ఉన్న పొలంలో కొంత భాగాన్ని విక్రయించేందుకు కుమారులతో సంప్రదించగా... వారు ఒప్పుకోలేదు. దీంతో అప్పు ఎలా తీర్చాలో అర్థం కాక మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.












Click it and Unblock the Notifications