హరీశ్ వల్లే టీఆర్ఎస్! కేసీఆరే నా గాడ్‌ఫాదర్, కానీ..: బాబు మోహన్ ఆవేదన
సంగారెడ్డి: తెలంగాణ ఆపధ్మర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావుపై ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ విమర్శల దాడిని కొనసాగిస్తున్నారు. ఆందోల్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను సంప్రదించకుండా మరో వ్యక్తికి టికెట్ కేటాయించి కేసీఆర్ తనను మోసం చేశారని మండిపడ్డారు.
Recommended Video


హరీశ్ వల్లే టీఆర్ఎస్ బతుకుతోంది..
సంగారెడ్డి బీజేపీ కార్యాలయంలో బాబు మోహన్ మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్ రావు వల్లే టీఆర్ఎస్ పార్టీ బతుకుతోందని అన్నారు. తనకు వ్యతిరేకంగా కుట్ర పన్ని ఆందోల్ టీఆర్ఎస్ టికెట్ రాకుండా ఆ పార్టీ నేతలే మోసం చేశారని అన్నారు.

కేసీఆర్ నా గాడ్ ఫాదర్ కానీ..
తాను రాజకీయాల్లోకి వచ్చింది కేసీఆర్ వల్లేనని, ఆయన ఎటు వెళ్తే అటువైపే ఉన్నానని తెలిపారు. 25ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తనను కాదని, స్థానికుడి పేరుతో వేరొకరికి టికెట్ కేటాయించడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని బాబు మోహన్ తెలిపారు. తనకు కేసీఆర్ అంటే ఇష్టమని, ఆయన్ని గాడ్ ఫాదర్‌గా భావిస్తున్నానని చెప్పారు. అలాంటి కేసీఆర్.. తనను రోడ్డుపై వదిలేశారని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు.

మచ్చలేని రాజకీయం నాది..
తన రాజకీయ జీవితంలో ఎలాంటి మచ్చ లేకుండా జీవించానని, టికెట్ కోసం ఫాంహౌస్, ప్రగతిభవన్ చుట్టూ తిరగలేదని బాబు మోహన్ అన్నారు. కేసీఆర్ ఒక్కసారైనా సెక్రటేరియట్ వెళ్లారా? అని ప్రశ్నించారు.

అందుకే బీజేపీలోకి..
తన సేవనలు గుర్తించి బీజేపీ తమ పార్టీలోకి ఆహ్వానించిందని, అందుకే ఆ పార్టీలో చేరానని బాబు మోహన్ తెలిపారు. కాగా, కేసీఆర్ ప్రకటించిన తొలి జాబితా 105మంది ఎమ్మెల్యే అభ్యర్థుల్లో బాబు మోహన్ పేరు కాకుండా మరొకరిని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు.












Click it and Unblock the Notifications