ఇంతలా అవమానించాక..: బీజేపీకి రాజీనామా చేసిన బాబు మోహన్
హైదరాబాద్: మాజీ మంత్రి, ప్రముఖ సినీనటుడు బాబు మోహన్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను గురువారం పార్టీ అధిష్టానానికి పంపిస్తానని బాబు మోహన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ(BJP) పెద్దల వైఖరి తీవ్ర అభ్యంతరకరంగా ఉందని, పొమ్మనకుండా పొగ పెడుతున్నారని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.
పార్టీ కోసం చాలా కష్టపడ్డానని, తెలంగాణ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నికలలో తిరిగి ప్రచారం చేశానని బాబుమోహన్ తెలిపారు. పార్టీ గెలుపునకు ఎంతో శ్రమించానని చెప్పారు. పార్టీలో ఏబీసీడీ సెక్షన్లుగా నాయకులను విభజించి అత్యంత అవమానకరంగా తనను డీ క్యాటగిరిగా నిర్ణయించడం సమంజసం కాదని బాబు మోహన్ వాపోయారు. తనను డీ కేటగిరీ కింద నిర్ణయించడానికి రాష్ట్ర నాయకులకు ఏం అధికారం ఉందని ప్రశ్నించారు బాబు మోహన్. రాష్ట్ర పార్టీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తనను దూరం పెడుతున్నారని ఆరోపించారు.

తాను వరంగల్ ఎంపీగా పోటీ చేసి ప్రజలకు సేవలందిచాలని నిర్ణయించుకున్నట్లు బాబు మోహన్ తెలిపారు. తనను అవమానించడానికే రాష్ట్ర బీజేపీ పెద్దలు నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోందన్నారు బాబు మోహన్. ఎప్పటికైనా వరంగల్ ప్రజలకు ఎంపీగా సేవలందించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి తనను దూరం పెడుతూ ఫోన్ కూడా ఎత్తడం లేదని తెలిపారు. అందుకే పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు బాబు మోహన్ వెల్లడించారు.
కాగా, బాబు మోహన్ రాజకీయ జీవితం తెలుగుదేశంలో పార్టీలో ప్రారంభమైంది. మొదటిసారిగా టీడీపీ నుంచి 1999లో మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పటి టీడీపీ ప్రభుత్వంలో సాంఘిక, సంక్షేమ మంత్రిగా పని చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరి 2004, 2014లో అందోల్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహాపై విజయం సాధించారు.
2018లో బీఆర్ఎస్ నుంటి టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి పోటీచేసి బీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతికుమార్ చేతిలో ఓడిపోయారు. అనంతరం 2023లో బీజేపీ నుంచి మరోమారు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహా చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలోనే ఆయన బీజేపీని వీడటం చర్చనీయాంశంగా మారింది. అయితే, బాబు మోహన్ ఇప్పుడు ఏ పార్టీలో చేరతారనేది త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications