బాలకృష్ణ తెల్లన్నం వ్యాఖ్యలు: రేవంత్ రెడ్డికి లక్ష్యానికి విఘాతం
హైదరాబాద్: తెలంగాణలో పార్టీని బలోపేతం చేసి, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు షాక్ ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి అనూహ్యమైన ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా పార్టీ హిందూపురం శాసనసభ్యుడు, ఎన్టీ రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు ఆయన ప్రయత్నాలకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణవాళ్లకు తెల్లన్నం తెలియదని, తన తండ్రి ఎన్టీఆర్ వారికి తెల్లన్నం రుచి చూపించారని బాలకృష్ణ అనడంపై పెద్ద దుమారమే చెలరేగుతోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆయన వ్యాఖ్యలు దెబ్బ తీశాయని భావిస్తున్నారు. దానివల్ల తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మరింతగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో ఆత్మగౌరవ నినాదం ప్రధానమైంది. తెలుగుదేశం పార్టీ ఎక్కువగా తెలంగాణలో దెబ్బ తిన్నది ఆకారణంగానే. తెలంగాణలో ఉన్న బలమైన క్యాడర్‌ను కూడా కోల్పోయింది. ఆంధ్ర సెటిలర్లను ఆసరా చేసుకుని హైదరాబాదులో పాగా వేయాలనే టిడిపి ప్రయత్నం కూడా ఫలించలేదు.
విభజన సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న వైఖరి వల్ల తెలంగాణలో పార్టీ కొంత వరకు దెబ్బ తిన్నది. ఆ తర్వాత నోటుకు ఓటు కేసుతో చాలా వరకు బలహీనపడింది. విభజన తర్వాత కూడా చంద్రబాబు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టాన్నే తెచ్చిపెట్టాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఆయన చేసిన వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు సానుకూలంగా తీసుకోలేకపోయారు.
నిజానికి, కోస్తాంధ్ర లేదా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సానుకూల వైఖరి, తెలంగాణ వ్యతిరేక వైఖరి లేకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఇప్పటికీ బలంగానే ఉండేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెసు పార్టీపై కన్నా తెలుగుదేశం పార్టీపై ఎక్కువగా తెలంగాణ ప్రజల అభిమానం చూపుతూ వచ్చారు. ఈ స్థితిలో దశలవారీగా ఉద్దేశ్యపూర్వకంగానో, అయాచితంగానో ఆంధ్రప్రదేశ్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణలో టిడిపిని దెబ్బ తీస్తున్నాయి.
బాలకృష్ణ ప్రస్తుత వ్యాఖ్యలు తెలంగాణలో టిడిపిని మరింతగా దెబ్బ తీస్తాయని, పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలనే రేవంత్ రెడ్డి లక్ష్యం దెబ్బ తింటుందని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కోరి తెలంగాణలో పార్టీని దెబ్బ తీసుకునే విధంగా వ్యవహరిస్తున్నారనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications