కాంగ్రెస్ గ్యారంటీలు + రాష్ట్ర బడ్జెట్ = గాడిది గుడ్డంటూ బండి సంజయ్ సెటైర్లు
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌పై స్పందిస్తూ.. కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్
6 గ్యారంటీలు + తెలంగాణ బడ్జెట్ = గాడిద గుడ్డే అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క చదివింది.. ఆర్థిక బడ్జెట్‌టో లేదంటే అప్పుల పత్రమో క్లారిటీ లేదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆరు గ్యారంటీల అమలుకు తగిన నిధుల ఊసు లేదు. బడ్జెట్ కేటాయింపులకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో లెక్కా పత్రం లేదు.
రుణమాఫీ పూర్తిస్థాయిలో చేసే దమ్ము లేదు. రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చి రుణమాఫీ డిఫాల్టర్ల జాబితా నుండి తొలగిస్తారో లేదో స్పష్టత లేదు అని బండి సంజయ్ విమర్శించారు.

రూ.లక్షన్నర కోట్లతో నిర్మిస్తామన్న మూసీ రివర్ ఫ్రంట్ కు బడ్జెట్ లో పైసా లేదు. రైతు భరోసా, రూ.500 బోనస్, పంట నష్ట పరిహారం నిధులను ఈ ఏడాది చెల్లిస్తారా? లేదో చెప్పలేదు. 90 లక్షల తెల్ల రేషన్ కార్డులుంటే, 39 లక్షల మందికే గ్యాస్ సబ్సిడీ ఇచ్చి గొప్పలు చెప్పుకోవడానికి సిగ్గులేదు. 50 లక్షల మంది అర్హులకు రూ.500 సబ్సిడీని ఎగ్గొట్టి మహిళల్లో వెలుగులు నింపామని చెప్పుకోవడం సిగ్గు చేటు అంటూ కాంగ్రెస్ సర్కారును దుయ్యబట్టారు బండి సంజయ్.
కేబినెట్ మంత్రుల మధ్యే సఖ్యత లేని వీళ్లు తెలంగాణలో సమసమాజాన్ని స్థాపిస్తామని జోకులేస్తారు. సర్కారీ భూములను అగ్గువకు అమ్మాలని చూస్తారు. 12 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చి 31 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామంటారు. రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు కేటాయించిన ప్రభుత్వం హిందువుల పండుగలకు నయాపైసా లేదంటారు. మొత్తంగా తెలంగాణ బడ్జెట్ లో రాష్ట్ర ప్రజలకు మిగిలింది 'గాడిద గుడ్డే' అంటూ రేవంత్ ప్రభుత్వంపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications