సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కోల్పోతున్నారు, ‘ఉడ్తా హైదరాబాద్’ పరిస్థితి: కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్తాయిలో విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. డ్రగ్స్ దందాపై తీసిన ఉడ్తా పంజాబ్ సినిమా మాదిరిగా.. ఉడ్తా హైదరాబాద్ సినిమా తీసే పరిస్థితి వచ్చిందని దుయ్యబట్టారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

డ్రగ్స్ కారణంగా ఉద్యోగాలు కోల్పోతున్నారు: బండి సంజయ్
పంజాబ్ ప్రభుత్వం కూలిపోయిందంటే.. అందుకు డ్రగ్స్ దందానే కారణమన్నారు బండి సంజయ్. హైదరాబాద్‌లో ఉన్న యువత, విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు డ్రగ్స్ బారిన పడతారేమోనని ఆందోలన చెందుతున్నారన్నారు. డ్రగ్స్ తీసుకుంటున్నారని తెలిసి.. హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే 15 మంది ఉద్యోగులను తొలగించారంటే.. ఏ స్థాయిలో హైదరాబాద్ అడ్డాగా డ్రగ్స్ దందా నడుస్తుందో ప్రజలు అర్థం చేసుకోవచ్చని అన్నారు.
Recommended Video


డ్రగ్స్ దందాలో టీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ సన్నిహితుల హస్తం: బండి సంజయ్
టీఆర్ఎస్ నేతలు, సీఎం కేసీఆర్ సన్నిహితుల హస్తం ఉన్నందునే డ్రగ్స్ దందా కొనసాగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. డ్రగ్స్‌పై సమీక్షల పేరుతో సీఎం కేసీఆర్ కాలయాపన చేస్తున్నారే తప్ప.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వెయ్యి మందితో కమిటీ వేసి డ్రగ్స్‌ను నిర్మూలిస్తామని గతంలో ప్రకటించారని, ఇచ్చిన హామీ ఏమైందో సీఎం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. 2015 నాటి డ్రగ్స్ కేసు విచారణ మరుగున పడేశారని, కొందరి పేర్లు లీక్ చేసినా ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదన్నారు. ఏ కేసు గురించైనా తొలుత సీఎం కేసీఆర్ హల్చల్ చేస్తారని.. ఆ తర్వాత మరుగున పడేస్తారని విమర్శించారు.

కేసీఈర్ కుటుంబసభ్యుడికి 112 వైన్ షాపులు: బండి సంజయ్
హైదరాబాద్‌ను మాఫియా, డ్రగ్స్‌కు అడ్డాగా మార్చిన ఘనత కేసీఆర్‌ది, టీఆర్ఎస్‌దేనని అన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుడికి తెలంగాణలో 112 వైన్స్ షాపులున్నాయి. డ్రగ్స్ కేసులో విచారణ చేసిన అధికారులను సైతం ఢిల్లీకి పంపారు. డ్రగ్స్ కేసులో తన కుటుంబానికి సంబంధం ఉన్నందునే ఈడీకి కేసీఆర్ సహరించలేదు. కేసీఆర్ విలనిజానికి.. ఒక ఐపీఎస్ బలైండు' అని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. డ్రగ్స్ కేసు వివరాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈడీ లేఖ రాసినా స్పందించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని ఈడీ చివరకు హైకోర్టును ఆశ్రయించిందని గుర్తు చేశారు బండి సంజయ్.












Click it and Unblock the Notifications