ముఖ్యమంత్రికి కనీస మానవత్వం లేదా? హెచ్సీయూ ఘటనపై బండి సంజయ్ ఫైర్
హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ భూములను రక్షించేందుకు ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రికి కనీస మానవత్వం లేదా? అంటూ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ భూముల రక్షణ కోసం విద్యార్థులు ఆందోళన చేస్తుంటే... వాళ్లను గొడ్డును బాదినట్లు బాదుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భూములు అమ్మకుంటే రాష్ట్రాన్ని పాలించలేరా? : బండి సంజయ్
అమ్మాయిలని చూడకుండా జుట్టుపట్టుకుని గుంజుకుపోయి చితకబాదుతారా? ఇదేం పద్దతి? భూములు అమ్మకుంటే రాష్ట్రాన్ని పాలించే పరిస్థితి లేదా? భూములన్ని వేల కోట్లు సంపాదించి దండుకోవడమే మీ పనా? అంటూ బండి సంజయ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాబోయే తరాలకు గజం భూమి కూడా ఉంచకుండా చేస్తారా? ఇదేం పాలన? అంత మాత్రాన మీరెందుకు...కేఏ పాల్ కు అప్పగించినా అదే పని చేస్తారు కదా?''అంటూ మండిపడ్డారు.

రాత్రివేళ ఇష్టమొచ్చినట్లు కొట్టి అరాచక పాలన చేస్తారా?
నిన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీఛార్జీ చూసి బాధపడని వాళ్లు లేరన్నారు. ప్రతి ఒక్కరికి కళ్లల్లో నీళ్లు తిరిగాయని ఆయన పేర్కొన్నారు . కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఏదో గొప్ప పనిచేశామని అనుకుంటున్నారు అని మండిపడ్డారు. ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే రూముల్లో దూరి కొడతారా? రాత్రివేళ ఇష్టమొచ్చినట్లు కొట్టి అరాచక పాలన చేస్తారా?
భూములను అమ్మి పాలించడానికి మీరెందుకు?
లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తం ఘటనపై విచారణ జరపాలన్నారు. ఇంత జరుగుతుంటే విద్యా కమిషన్ ఏం చేస్తోంది అని ప్రశ్నించారు.
అసలు వర్శిటీ భూములు అమ్మాల్సిన కర్మ ఏంది? అమ్మడానికి మీరెవరు? అభివృద్ధి పేరుతో భూములను అమ్మి పాలించడానికి మీరెందుకు? అని ప్రశ్నించారు.
ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదు?
అప్పులు తెచ్చి, భూములు అమ్మి, ప్రజల ఆస్తులను అమ్ముతామని ఎన్నికలకు ముందే ఎందుకు చెప్పలేదు? అని ప్రశ్నించారు. హెచ్ సీయూ భూముల అమ్మకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications