Bandla Ganesh: కేటీఆర్, హరీష్ రావుపై విరుచుకుపడిన బండ్ల గణేష్..
మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత, సినీ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. అసూయ ద్వేషంతో కేటీఆర్, హరీష్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓ రోజు హరీష్ రావు, మరో రోజు కేటీఆర్, ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత ప్రభుత్వంపై అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం తెలంగాణను ప్రగతిపథంలో తీసుకెళ్తున్నారని చెప్పారు.
వంద రోజుల తర్వాత కూడా కాంగ్రెస్‌ను హరీష్ రావు ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు. నియంతృత్వ పాలనకు పాతరేసి, ప్రజాపాలన తీసుకొచ్చామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసి తీరుతామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని బండ్ల గణేష్ గుర్తు చేశారు. అలాగే ఆరోగ్య శ్రీ రూ. 10 లక్షలకు పెంచామని వివరించారు.

గత తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంతమంది మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారో చెప్పాలని బండ్ల గణేష్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలరోజులే అయిందన్నారు. కానీ అర్థం చేసుకోకుండా హరీ్ష్ రావు, కేటీఆర్ ప్రతి రోజు ప్రెస్ మీట్‌లు పెట్టి ఏం చేస్తారని నిలదీశారు. నెల రోజుల్లో ఇంత గొప్పగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన చేస్తుంటే.. హరీష్ రావు ఎందుకింత ఈర్ష్య పడుతున్నారని ప్రశ్నించారు.
కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని బండ్ల గణేష్ చెప్పారు. బండ్ల గణేష్ కు ఎమ్మెల్సీ వదవి వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కాస్త దూకుడుగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. మరోవైపు సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రజాపాలనపై చర్చించనున్నారు.












Click it and Unblock the Notifications