బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల ఏపీలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. ఉత్తరాంధ్ర సహా, ఏపీ దక్షిణ తీర ప్రాంత జిల్లాలు, రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షపాతం నమోదవుతోంది. ఇదే పరిస్థితి మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
బంగాళాఖాతం ఉత్తర ప్రాంతానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. చెప్పుకోదగ్గ స్థాయిలో వర్షపాతం నమోదవుతోంది.

ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కర్నూలు, తిరుపతి, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తారు వర్షాలు కురిశాయి.
మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. పిడుగులతో కూడిన వర్షపాతం నమోదు కావొచ్చని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.
నేడు- అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.
నేడు- శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, వైఎస్సార్ కడప, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలు లేకపోలేదని విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేస్తోంది. ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు హోర్డింగులు, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి ప్రదేశాల వద్ద నిల్చోకూడదని విజ్ఞప్తి చేశారు. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద తలదాచుకోవద్దని ప్రఖర్ జైన్ సూచించారు.












Click it and Unblock the Notifications