Hema: బెంగళూరు రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకుందా ? తేల్చేసిన పోలీసులు-ఛార్జిషీట్ లో క్లారిటీ..!
ఈ ఏడాది మే 15న బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకూ ఈ కేసులో తమకు దొరికిన ఆధారాలతో బెంగళూరు పోలీసులు స్దానిక కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఇందులో మొత్తం 88 మంది పాల్గొన్నట్లు నిర్ధారించారు. అలాగే వీరిలో ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు, ఎవరు తీసుకోలేదో కూడా చెప్పేశారు. ఇందులో టాలీవుడ్ నటి హేమ పేరు కూడా ఉంది.

బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ వాడకానికి సంబంధించి పోలీసులు వెయ్యి పేజీలకు పైగా ఛార్జిషీట్ ను కోర్టులో దాఖలు చేశారు. ఇందులో రేవ్ పార్టీలో పాల్గొన్న 88 మందిలో 79 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు తేల్చారు. ఇందులో టాలీవుడ్ నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారించారు. ఇప్పటివరకూ హేమ తాను డ్రగ్స్ తీసుకోలేదని, అది అసలు రేవ్ పార్టీనే కాదని కేవలం బర్త్ డే పార్టీయేనని బుకాయిస్తూ వస్తున్నారు. గతంలో రేవ్ పార్టీపై పోలీసుల రైడ్ తర్వాత హైదరాబాద్ లోని ఇంట్లోనే ఉన్నట్లు, అక్కడికి వెళ్లలేదంటూ వీడియోలు చేసి మరీ బుకాయించిన హైమ ఇప్పుడు పోలీసుల ఛార్జిషీట్ తో అడ్డంగా బుక్కయింది.
రేవ్ పార్టీలో హేమ ఎండీఎంఏ డ్రగ్ సేవించినట్లు పోలీసులు ఛార్జిషీట్ లో పేర్కొన్నారు. దీంతో హేమతో పాటు మొత్తం 79 నిందితులపైనా ఎన్డీపీఎస్ చట్టంలోని సెక్షన్ 27బీ ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం ఆరు నెలల వరకూ జైలుశిక్ష, 10 వేల వరకూ జరిమానా కూడా విధిస్తారు. వాస్తవానికి గతంలోనే హేమకు నిర్వహించిన డ్రగ్ పరీక్షలు పాజిటివ్ గా వచ్చాయి. దీంతో ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ తర్వాత ఆమె బెయిల్ పై బయటికి వచ్చారు. ఇప్పుడు కోర్టులో ఛార్జిషీట్ దాఖలు కావడంతో హేమతో పాటు ఇతర నిందితుల విషయంలో పోలీసులు తీసుకునే చర్యలు ఆసక్తికరంగా మారాయి.












Click it and Unblock the Notifications