వినూత్నంగా భద్రాద్రి రామయ్య ఉత్సవాలు- సీఎం రేవంత్‌కు ఆహ్వానం
ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి. అయోధ్యలోని రామ్ లల్లా ఆలయం మొదలుకుని దేశవ్యాప్తంగా అన్ని దేవస్థానాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. తెలంగాణలో భద్రాచలం, ఏపీలో ఒంటిమిట్ట ఆలయంలో ఏటేటా అంగరంగ వైభవంగా రామనవమి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయంలో కన్నుల పండువగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్వయంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తోన్నారు. అధికారులతో సమీక్షలను సైతం నిర్వహించారు.

తాజాగా మంత్రి కొండా సురేఖ కొద్దిసేపటి కిందటే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారి వెంట భద్రాచలం ఆలయ అర్చకులు ఉన్నారు. సీతారాములవారి కళ్యాణోత్సవానికి హాజరు కావాలంటూ రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అర్చకులు రేవంత్ రెడ్డి ఆశీర్వచనాలు పలికారు. రాములవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు. అనంతరం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు శ్రీరామ నవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ నెల 30వ తేదీన శ్రీ విశ్వావసు నామ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఆరంభమౌతాయి. ఏప్రిల్ 12వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇందులో భాగంగా 6వ తేదీన శ్రీ సీతారామ కల్యాణ మహోత్సవం, 7వ తేదీన శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం జరుగనున్నాయి.
ఆలయ అభివృద్ధికి సంబంధించిన భూసేకరణ, ఇతర వివరాల గురించి రేవంత్ రెడ్డి దేవాదాయ మంత్రిత్వ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణను వేగవంతం చేయాలని సూచించారు. ఆలయాభివృద్ధికి అవసరమైన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
భద్రాద్రి రామయ్య ఉత్సవాలకు రేవంత్‌కు ఆహ్వానం.!#RevanthReddy #MalluBhattiVikramarka #Badradi #Telangana #OITelugu pic.twitter.com/KiKB0N6VVn
— oneindiatelugu (@oneindiatelugu) March 23, 2025
ముఖ్యమంత్రిని కలిసినవారిలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, భద్రాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారిణి రమాదేవి ఉన్నారు.












Click it and Unblock the Notifications