హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలు బాధను, భయాన్ని కలిగించాయి!!
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుంది. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా పర్యటిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేత భట్టి విక్రమార్క ఈ రోజు పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కమలాపూర్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చేవెళ్ల సభలో హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించవలసిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఒక మతానికి వ్యతిరేకంగా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.
దేశంలో రక్తపాతం సృష్టించి పాలన సాగించాలన్న చందంగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో బాధ, భయం రెండు కలుగుతున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ బయట బీజేపీని వ్యతిరేకిస్తూనే, పార్లమెంటులో పెట్టే ప్రతి బిల్లును సమర్థిస్తూ వత్తాసు పలుకుతోందని ఆ రెండు పార్టీలు ఒక్కటేనన్నారు. దేశ హోంశాఖమంత్రి ఒక మతానికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. దేశాన్ని విభజించి మత రాజకీయాలు చేస్తే దేశాన్ని ఎవరు కాపాడాలని ఆయన నిలదీశారు.

హోంశాఖను అమిత్ షా అవమానిస్తున్నారని భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను గతంలో కాంగ్రెస్ పార్టీ ఇస్తే, 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మాటలు చెప్పిన బీఆర్ఎస్, అసలు మొత్తానికి ముస్లింలకు రిజర్వేషన్లు తొలగించటానికి సిద్ధమైన బీజేపీకి అడుగడుగున వత్తాసు పలుకుతున్నారన్నారు. బిజెపి, బిఆర్ఎస్ రెండూ ఒకదానికొకటి అంటకాగుతున్నాయని, బిఆర్ఎస్ రాజకీయ స్వలాభం కోసం బీజేపీకి లొంగిపోయి తెలంగాణ సమాజాన్ని ఇబ్బంది పెడుతున్న వైనాన్ని ఖండిస్తున్నామన్నారు భట్టి విక్రమార్క.
అమిత్ షా వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ వేశారు. ప్రస్తుతం బిజెపి అధికారంలోకి ఉందనే విషయాన్ని గుర్తు చేసి, గత తొమ్మిదిన్నరేళ్ళుగా బీజేపీనే అధికారంలో ఉందని పేర్కొని, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి.. ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. లోపాయికారి ఒప్పందం ఉన్నందువల్లే చర్యలు తీసుకోలేక పోయారు అంటూ పేర్కొన్నారు.
దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బిఆర్ఎస్ ఆటలు ఇక సాగనివ్వబోమని, ఇద్దరినీ సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ప్రజలంతా ఈ విషయాన్ని గమనించి వచ్చే ఎన్నికలలో ప్రజల మేలుకోరే కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 39వ రోజు హుజురాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో కొనసాగుతోంది. ఉదయం 9 గం.లకు హుజురాబాద్ నియోజకవర్గం కమలాపురంలో పాదయాత్ర ప్రారంభమైంది.
కమలాపూర్ నుండి ఖనిపర్తి శంభునిపల్లి, హుస్నాబాద్ నియోజకవర్గంలోని గుంటూరు పల్లి, ఆరేపల్లి, బావుపేట క్రాస్ రోడ్, ఎల్లాపూర్, హసన్పర్తి, కాకతీయ యూనివర్సిటీ వరకు పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం హసన్ పర్తి గ్రామంలో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications