జగన్‌కు భట్టి ఆత్మీయ ఆహ్వానం.. కాంగ్రెస్‌లోకి వచ్చేయండి
దేశ రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పి, వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీని వీడి వేరే పార్టీలు పెట్టుకున్న సీనియర్ నేతలందరూ తిరిగి సొంతగూటికి రావాలని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మనస్పూర్తిగా పిలుపునిచ్చారు. కొచ్చి వేదికగా జరిగిన 'ఇండియాటుడే కాంక్లేవ్ సౌత్ 2026' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశ రాజకీయాలు, కాంగ్రెస్ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు పాత నేతలంతా మళ్లీ తిరిగి వస్తే తాను అత్యంత సంతోషించే వ్యక్తిని అవుతానని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ను విడిచిపెట్టి వెళ్లిన ప్రతి ఒక్క నాయకుడు మళ్లీ పార్టీలోకి రావాలని ఆయన కోరారు.
వైఎస్ఆర్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ..
ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డితో తనకున్న రాజకీయ అనుబంధాన్ని భట్టి విక్రమార్క ప్రత్యేకంగా గుర్తుచేసుకున్నారు. తాను వైఎస్‌ఆర్‌తో కలిసి పనిచేశానని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి పనిచేయకపోయినప్పటికీ.. ఒక నిజమైన కాంగ్రెస్ వాదిగా పాత నేతలందరూ తిరిగి వస్తే తాను ఎంతో సంతోషిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉండి వేరుపడిన మమతా బెనర్జీ (తృణమూల్ కాంగ్రెస్), శరద్ పవార్ (ఎన్‌సీపీ) వంటి దిగ్గజ నేతలతో పాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంటి వారందరినీ ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

“I appeal to all the old Congress leaders throughout the country who have left the party: please come and join the Congress party. Let us implement the Congress party’s ideology in this country and strengthen the country,” Bhatti Vikramarka Mallu (Deputy CM, Telangana).… pic.twitter.com/BcdQ9XkybT
— IndiaToday (@IndiaToday) September 30, 2026
ఈసీ తీరుపై తీవ్ర ఆగ్రహం..
ఇదే వేదికగా కేంద్ర ఎన్నికల సంఘం పనితీరుపై భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎన్నికల ప్రక్రియపై పూర్తి నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఈసీపై ఉంటుందని ఆయన హితవు పలికారు. ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో పేర్లు తొలగిపోతున్నాయని, బీజేపీకి లబ్ధి చేకూర్చేలా ఓటర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఎన్నికల పారదర్శకతపై ప్రజలకు అనుమానాలున్నప్పుడు బ్యాలెట్ పేపర్లను మళ్లీ ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘంలో నెలకొన్న విభేదాలు వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశాయని పేర్కొంటూ.. ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ పథకాలు 'ఉచితాలు' కావు..
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఐదు గ్యారెంటీలను కేవలం ఫ్రీబీలు అనే పదాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. సొంత ఇల్లు లేని పేదవాడికి ఆత్మగౌరవంతో ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇస్తే, అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు నడిపిస్తుందని ఆయన స్పష్టం చేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు భరోసా కింద ఇస్తున్న ఆర్థిక సాయం రైతులను వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నాయని, ఇవి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే సంక్షేమ అస్త్రాలని భట్టి వివరించారు.
కేంద్రం తీరుపై విమర్శలు.. రాష్ట్రాల హక్కుల కోసం ఫెడరల్ స్ఫూర్తి
దేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కూడా భట్టి విక్రమార్క అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రానికి చెల్లిస్తున్న ప్రతి రూపాయిలో తెలంగాణకు కేవలం 43 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణ భారత రాష్ట్రాలన్నింటికీ ఇదే సమస్య ఉందని ఆయన గుర్తుచేశారు. బీజేపీ పాలిత ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తూ, దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ఆయన హితవు పలికారు. ఇక తెలంగాణ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డితో తన సంబంధాలపై స్పందిస్తూ.. తామంతా ఎలాంటి విభేదాలు లేకుండా సమిష్టిగా పనిచేస్తూ కాంగ్రెస్ సిద్ధాంతాలను అమలు చేస్తున్నామని భట్టి స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications
