పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్: ‘బీమ్లానాయక్’ ఐదో షోకు అనుమతి
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు పవన్ కళ్యాణ్ అభిమానులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఫిబ్రవరి 25న విడుదలయ్యే బీమ్లా నాయక్ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఐదో షోకు అనుమతిస్తూ అభిమానులను ఆనందంలో ముంచింది.

బీమ్లానాయక్ ఐదో ఆటకు తెలంగాణలో గ్రీన్ సిగ్నల్
రాష్ట్ర వ్యాప్తంగా బీమ్లానాయక్ ఐదో ఆటకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 11వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి థియేటర్‌లోనూ ఐదో ఆటను ప్రదర్శించుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయం పట్ల పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వకీల్‌సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం కావడంతో బీమ్లానాయక్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. భీమ్లా నాయక్ సినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు తెలంగాణలో ఐదవ షో కోసం అనుమతి అడగ్గా ఇందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

బీమ్లా నాయక్‌పై భారీ అంచనాలు
సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన బీమ్లానాయక్ సినిమాలో రానా దగ్గుబాటి ప్రతినాయకుడి పాత్రను చేస్తున్నారు. పవన్ సరసన నిత్యమీనన్ నటించింది. తమన్ సంగీత దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ సంభాషణలు అందించారు. కాగా, ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, ట్రైలర్లతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బుధవారం సాయంత్రం 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది.

బీమ్లా నాయక్.. తెలంగాణలో ఇలా.. ఏపీలో అలా
థియేటర్ల వద్ద హెవీ రష్‌ని తగ్గించటానికి, బ్లాక్ టికెట్ల అమ్మకం జరగకుండా ఉండటానికి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి భీమ్లా నాయక్ సినిమాకి ఐదో షో పర్మిషన్ ఇస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. ఈ అనుమతి రెండు వారాల పాటు ఇవ్వడం గమనార్హం. ఫిబ్రవరి 25 నుంచి మార్చ్ 11 వరకు ఐదో షో పర్మిషన్ ఇచ్చారు. దీంతో సినిమాకి కూడా లాభాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాగా, తెలంగాణాలో పరిస్థితి ఇలావుంటే అటు ఆంధ్రాలో మాత్రం ఇంకా టికెట్ రేట్ల సమస్య కొనసాగుతూనే ఉంది . అంతేగాక అయిదో షోకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు, బెనిఫిట్ షోలు కూడా పడే పరిస్థితి లేదు. దీంతో ఏపీలో పవన్ అభిమానులు అక్కడి సర్కారుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications