బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. సుప్రీంకోర్టులో ఆ పిటీషన్ డిస్మిస్!!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బి ఆర్ ఎస్ పార్టీకి సుప్రీం ధర్మాసనం షాక్ ఇచ్చింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు గుర్తును పోలిన గుర్తులను మరి ఏ ఇతర రాజకీయ పార్టీలకు కేటాయించకుండా ఎన్నికల కమిషన్ కు ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టు మెట్లు ఎక్కిన బీఆర్ఎస్ పార్టీకి అక్కడ చుక్కెదురైంది.
బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్ ను తాజాగా సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ సందర్భంగా ఓటర్లకు అన్ని తెలుసనీ, ఏ గుర్తు ఏమిటో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఓటర్లు లేరని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. చాలాకాలంగా బిఆర్ఎస్ పార్టీ తమ పార్టీ గుర్తులను పోలి ఉన్న గుర్తులను ఇతర పార్టీలకు కేటాయించవద్దని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తులు చేసినా, అనేకమార్లు అభ్యంతరం వ్యక్తం చేసినా ఇప్పటివరకు ఎన్నికలసంఘం నుంచి దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

దీంతో తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ గుర్తు అయిన కారు గుర్తును పోలిన గుర్తుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కడంతో పాటు, సుప్రీంకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేసింది. గత కొన్ని నెలలుగా తమ పార్టీ గుర్తును పోలిన గుర్తులను ఎవరికి కేటాయించవద్దని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికలసంఘానికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేసిన పట్టించుకోలేదని, అలా కేటాయించటం వల్ల తమకు నష్టం జరిగిందని పేర్కొంది.
అయితే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ ఇప్పటి వరకు.. ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంపై తీవ్ర అసహనంతో ఉన్నబీఆర్ఎస్ పార్టీ కారును పోలి ఉన్న గుర్తులను ఏ పార్టీకి కేటాయించకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించేలా అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్, చపాతీ మేకర్ వంటి గుర్తులను ఎన్నికల్లో కేటాయించవద్దని పేర్కొంది.
అయితే దీనిపై విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం బీఆర్ఎస్ వాదనలను కొట్టి పారేసింది. ఈ పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఓటర్లకు కారుకు, రోడ్ రోలర్, చపాతీ మేకర్ లకు తేడా తెలుసని పేర్కొంది. ఓటర్లు అమాయకులు కాదని తెలిపింది.












Click it and Unblock the Notifications