ఆర్డర్ చేసిన గంటలో సరుకుల డెలివరీ: బిగ్ బాస్కెట్ 'బీబీ ఎక్స్‌ప్రెస్' సర్వీసు
హైదరాబాద్: ఇంటర్నెట్ ద్వారా ఆన్‌లైన్‌లో సూపర్ మార్కెట్ సేవలనందిస్తున్న వెబ్‌సైట్ బిగ్ బాస్కెట్, హైదరాబాద్‌లో 'బీబీ ఎక్స్‌ప్రెస్' పేరిట డెలివరీ సర్వీసును బుధవారం ప్రారంభించింది. దీని ద్వారా కస్టమర్లు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఉత్పత్తులను గంట వ్వవధిలోనే డెలివరీ చేయనుంది.
అలా నిర్ణీత కాలంలో డెలివరీ చేయని పక్షంలో కస్టమర్లకు 10 శాతం క్యాష్ బ్యాంక్ ఆఫర్‌ను ఇవ్వనున్నట్లు పేర్కొంది. అంతేకాదు ఆర్డర్ చేసిన ఉత్పత్తుల్లో దేనినైనా డెలివరీ చేయకపోతే దాని ధరలో 50 శాతం సొమ్మును కస్టమర్‌కు అదనంగా చెల్లించనుంది.
బుధవారం బిగ్ బాస్కెట్ సహ వ్యవస్థాపకుడు అభినయ్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి నిబంధనలు ఉన్న కారణంగా కస్టమర్లకు కచ్చితంగా నిర్ణీత కాలంలో ఆర్డర్‌ను డెలివరీ చేసే అవకాశం ఉందన్నారు. కాగా హైదరాబాద్‌తో పాటు పన్నెండు నగరాల్లో బిగ్ బాస్కెట్ తన కార్యాకలాపాలను సాగిస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని నగరాలకు కూడా విస్తరించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ మార్కెట్లలో బీబీ ఎక్స్‌ప్రెస్ సేవలు కూడా విడతల వారీగా అందుబాటులోకి తెస్తామన్నారు. ఇప్పటికే పూర్తి సర్వీసు డెలివరీ ద్వారా వ్యాన్లలో సరుకులను కస్టమర్లకు చేరవేస్తున్నామని, బీబీ ఎక్స్‌ప్రెస్ కింద్ బైక్‌ల ద్వారా సరుకులు డెలివరీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. 1,000 బ్రాండ్లకు చెందిన 14,000కు పైగా ఉత్పత్తులు బిగ్ బాస్కెట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.
ఆన్‌లైన్లో ఆర్డర్ చేసిన ఉత్పత్తులను డెలివరీ చేయడానికి కనీసం రూ. 40 నుంచి 50 వరకు ఖర్చవుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యాపాంర నిర్వహిస్తే మనుగడ సాధ్యమన్నారు. ఎక్కవ ఆఫర్లు ఇవ్వడం వల్ల కంపెనీలకు వచ్చే మార్జిన్లు తక్కువ స్థాయికే పరిమితమవుతాయన్నారు.
కాగా వచ్చే మార్చి నాటికి కంపెనీ రాబడి రూ. 1,000 కోట్లకు చేరుకోనున్నట్లు ఆయన తెలిపారు. 2017-18 నాటికి ఈ రాబడిని రూ. 12,000 కోట్లకు పెంచుకోవాలన్నదే తమ లక్ష్యమన్నారు. దీంత పాటు రాబోయే రోజుల్లో 30 నగరాలకు బిగ్ బాస్కెట్‌ను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
ఇప్పటికే 10 కోట్ల డాలర్ల నిధులు సమీకరించామని, విస్తరణ కోసం ఈ సొమ్మును వెచ్చించనున్నామని ఆయన తెలిపారు. బిగ్ బాస్కెట్ వ్యాపారంలో హైదరాబాద్ వాటా 15 శాతంగా ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications