బిజెపికి కోపం తెప్పించిన ఎర్రబెల్లి అరెస్ట్, కెసిఆర్! అదుపులో పెట్టు: పొంగులేటి
హైదరాబాద్/వరంగల్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు అరెస్టు పైన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ సోమవారం నాడు మాట్లాడారు.
ఎర్రబెల్లి అరెస్టును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడే బాధ్యత ప్రభుత్వం పైనే ఉందన్నారు. ఆధికార పక్షం ప్రోటోకాల్ పాటించకుండా వ్యవహరిస్తోందని భగ్గుమన్నారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయడం మానుకోవాలన్నారు.
పాలకుర్తి ఘటనలో ఎర్రబెల్లి అరెస్టును తాము తప్పుపడుతున్నామన్నారు. విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తోందన్నారు.

కెసిఆర్ అదుపులో పెట్టు: పొంగులేటి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంత్రులను అదుపులో పెట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న మంత్రులను అదుపులో పెట్టాలన్నారు.
అదిలాబాద్ జిల్లాను రెండుగా చేస్తే తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును పెట్టాలన్నారు. బాపూజీ పోస్టల్ స్టాంప్ కేంద్రం దృష్టిలో ఉందని చెప్పారు. ప్రభుత్వం తీరు ఆత్మహత్యలు చేసుకున్న రైతులను అవమానించేలా ఉందన్నారు. బిసి సబ్ ప్లాన్ ప్రవేశ పెట్టాలన్నారు.
హార్దిక్ పటేల్ వెనుక ఆరెస్సెస్: వి హనుమంత రావు
తమకు రిజర్వేషన్లు కావాలని చెబుతున్న హార్దిక్ పటేల్ వెనుక ఆరెస్సెస్ ఉందని కాంగ్రెస్ నేత వి హనుమంత రావు ఆరోపించారు. బిసిలకు ప్రస్తుత రిజర్వేషన్లు సరిగా అమలు కావడం లేదన్నారు. బిసిలకు అన్యాయం చేయాలని చూస్తే తాము ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారి పేరుతో అరాచకం సృష్టించాలని భావిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications