చీపురు పట్టిన జీ కిషన్ రెడ్డి (వీడియో)
Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవ గడువు సమీపించింది. ఈ నెల 22వ తేదీన ఈ ఆలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా 4,000 వేలమంది ప్రముఖులు హాజరు కానున్నారు. వివిధ దేశాల నుంచి వందమంది ప్రతినిధులు పాల్గొననున్నారు.
ఇప్పటికే ఆహ్వానపత్రికలు అందాయి. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్ నటీనటులు, సెలెబ్రిటీలకు ఆహ్వానం అందింది. అయోధ్యలో ప్రతి ఇంటికీ రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రికలను పంపించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.

రామమందిరం ప్రారంభోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ.. సరికొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలనూ పరిశుభ్రంగా ఉంచేలా స్వచ్ఛ అభియాన్‌ను శుక్రవారం ప్రారంభించారు. నాసిక్‌లోని ప్రాచీన కాలా రామ్ ఆలయం ప్రాంగణం మొత్తాన్నీ శుభ్రపరిచారు.
ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ నేతలు కొనసాగిస్తోన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు, నాయకలు.. ప్రతి రోజూ ఆలయాలను శుభ్రం చేస్తోన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సైతం తిరుచిరాపల్లిలోని శ్రీరంగనాథస్వామివారి ఆలయాన్నీ శుభ్ర పరిచారు.
ఈ కార్యక్రమాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ కిషన్ రెడ్డి నేడు హైదరాబాద్‌లో ప్రారంభించారు. ఈ ఉదయం బషీర్ బాగ్ చౌరస్తాలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని శుభ్రం చేశారు. చీపురు పట్టి ఆలయం మొత్తం ఊడ్చారు. చెత్తను ఎత్తి పడేశారు. ఆలయ గోపురం, విగ్రహాలను పైప్‌తో నీటిని చల్లి శుభ్ర పరిచారు.
Live: Shri Kanaka Durga Mata Temple, Basheerbagh, Hyderabad. https://t.co/L0PkyA7wD7
— G Kishan Reddy (@kishanreddybjp) January 17, 2024
మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రేమ్ సింగ్ రాథోడ్ సహా పలువురు నాయకులు, బీజేపీకి చెందిన కార్పొరేటర్లు ఇందులో పాల్గొన్నారు. సుమారు గంట పాటు ఈ కార్యక్రమం కొనసాగింది. అనంతరం కిషన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. 500 సంవత్సరాల నాటి హిందువుల ఆకాంక్షలు ఈ నెల 22వ తేదీన సాకారం కాబోతోన్నాయని అన్నారు.
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని దృష్టిలో ఉంచుకుని 11 రోజుల పాటు ఆలయాల్లో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించాలంటూ మోదీ పిలుపునిచ్చారని, ఆయన పిలుపునకు లక్షలాది మంది స్పందిస్తోన్నారని జీ కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 22వ తేదీన అన్ని ఆలయాల్లో దీపాలను వెలిగించి, పండగ వాతావరణంలో రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications