అక్కను ఇంతగా అవమానిస్తారా? వదిలిపెట్టను: ఎంపీ రఘునందన్ రావు వార్నింగ్ !
ఓ అధికారిక కార్యక్రమంలో కొండ సురేఖ రఘునందన్ రావు మధ్య జరిగిన ఓ చిన్న సన్నివేశాన్ని బీఆర్ఎస్ సోషల్ మీడియా అసభ్యకర రీతిలో ప్రచారం చేయడం పైన నిన్న కొండ సురేఖ కన్నీటి పర్యంతమైన విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారంలో నేడు బిజెపి ఎంపీ రఘునందన్ రావు స్పందించారు.
ఎంపీ రఘునందన్ రావు డిమాండ్
అధికారిక కార్యక్రమంలో ఒక తమ్ముడిగా మంత్రి కొండ సురేఖకు తాను చేనేత నూలుతో చేసిన కండువా కప్పేనని దానిని బిఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు తమ పార్టీ నేతలను కంట్రోల్ చేయాలని బిజెపి ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు.

కేసులు పెట్టి కోర్టుకు ఈడుస్తాం
మహిళలపైన అసభ్యమైన పోస్టులు పెట్టి తప్పుడు ప్రచారం చేసే వారి పైన కేసులు పెట్టి కోర్టుకు ఈడుస్తామని హెచ్చరించారు.ప్రతి ఒక్కడి ఇంట్లో తల్లి, అక్క, చెల్లి ఇలా ఎన్నో అనుబంధాలు ఉంటాయని, అటువంటి సంబంధాలపైన కూడా బిఆర్ఎస్ సోషల్ మీడియా సంస్కారహీనంగా పోస్టులు పెట్టడం దారుణమని ఆయన అన్నారు.
అక్క కొండా సురేఖకు జరిగిన అవమానానికి తమ్ముడిగా విచారం
ఒక తమ్ముడిగా మంత్రి సురేఖకు తను అడిగి మరీ నూలు పోగు దండ వేశానని, అలాంటి దండను ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు కూడా వేశానని కానీ దీనిపైన బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిందని రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్క కొండా సురేఖకు జరిగిన అవమానానికి తమ్ముడిగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని ఆయన తెలిపారు.
బీఆర్ఎస్ నేతలకు డిమాండ్
పోస్టులు పెట్టిన వారిపైన ఒక లాయర్ గా కోర్టుకు వెళ్తామని పేర్కొన్న రఘునందన్ తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు మీ వాళ్ళు అయితే తీసుకొచ్చి పోలీసులకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ నేతలకు సోషల్ మీడియా మీద కంట్రోల్ లేదా అని ప్రశ్నించారు. ఇక పోస్ట్ పెట్టిన వ్యక్తి మీకు సంబంధం లేని వారైతే వాళ్లపైన మీరు ఫిర్యాదు చేయాలని డిమాండ్ చేశారు.
క్షమాపణ చెప్పండి
కొండా సురేఖ ట్రోల్ చేస్తున్న వారి వివరాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్న బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇంత సంస్కారహీనంగా, సభ్యత లేకుండా మాట్లాడతారని తాను అనుకోలేదని వెంటనే స్పందించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరినైనా వ్యక్తిత్వ ఖననం చేయడం మంచిది కాదని, తన వల్ల అక్క సురేఖకు కలిగిన సౌకర్యానికి చింతిస్తూ విచారం వ్యక్తం చేస్తున్నానని బిజెపి ఎంపీ రఘునందన్ రావు వెల్లడించారు.












Click it and Unblock the Notifications