రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి ఇస్తుందా?
Revanth Reddy: దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోన్న అంశం- డీలిమిటేషన్. 2026 నాటికి జనాభా ప్రాతిపదికన లోక్‌సభ నియోజకవర్గాలను పునర్విభజించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఆశించిన స్థాయిలో సీట్ల సంఖ్య పెరగవని ఇక్కడి ప్రభుత్వాలు భావిస్తోన్నాయి.
అత్యధిక జనాభా
ఫలితంగా అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ రాజకీయంగా ఎంతగానో లబ్దిపొందుతాయనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్నారు డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. అందుకే ఎక్కువమంది పిల్లలను కనాలంటూ విజ్ఞప్తి చేస్తూ వస్తోన్నారాయన కొంతకాలంగా.
దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి
ఈ పరిస్థితుల మధ్య- కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తోన్న డీలిమిటేషన్ ప్రక్రియకు వ్యతిరేకంగా సరికొత్త ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు స్టాలిన్. దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకుని రావడానికి కృషి చేస్తోన్నారు. ఇందులో భాగంగా దక్షిణాదిన బీజేపీ- మిత్రపక్షాలేతర ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల అధినాయకులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

జగన్మోహన్ రెడ్డినీ
దీనికి హాజరు కావాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డినీ ఆహ్వానించారు స్టాలిన్. మంత్రి ఈవీ వేలు, ఎంపీ విల్సన్ బుధవారమే తాడేపల్లి కార్యాలయంలో జగన్‌ను కలిశారు. ఈ నెల 22వ తేదీన చెన్నైలో జరగనున్న దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశానికి హాజరు కావాలని కోరారు.
డీలిమిటేషన్ సమావేశానికి
ఇదే ఆహ్వానం అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికీ అందింది. దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఎంకే స్టాలిన్ తన ప్రతినిధి బృందాన్ని పంపించారని, డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కావాలని కోరిందని అన్నారు. ఇందులో పాల్గొనడానికి తాను సానుకూలంగా ఉన్నానని, పార్టీ హైకమాండ్ నుండి అనుమతి పొందాల్సి ఉందని చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర
బీజేపీ-ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై కుట్ర పన్నుతోందంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇది డీలిమిటేషన్ కాదని, దక్షిణాది రాష్ట్రాలను లిమిట్ చేయడమేనని ఆరోపించారు. తాము దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చి చెప్పారు. తమకు ఏనాడూ ఓటు వేయని దక్షిణాది రాష్ట్రాల ప్రజలపై ఉన్న ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి బీజేపీ ఇదంతా చేస్తోందని ధ్వజమెత్తారు.
#WATCH | Delhi | Telangana CM Revanth Reddy says, "Tamil Nadu CM MK Stalin sent a delegation to me, inviting me to join the meeting concerning the delimitation. The central govt led by BJP-NDA is conspiring against the Southern states. This is not a delimitation but a… pic.twitter.com/qZocJgNaaS
— ANI (@ANI) March 13, 2025
ప్రతీకార రాజకీయాలకు
బీజేపీ ఏకంగా దక్షిణాది రాష్ట్రాల ప్రజల మీదే ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా ఉద్యమించాలంటూ స్టాలిన్ తీసుకున్న నిర్ణయాన్ని, ఆయన వైఖరిని స్వాగతిస్తున్నానని చెప్పారు. ఈ సమావేశానికి హాజరు కావడానికి సూత్రప్రాయంగా అంగీకరించానని, పార్టీ అనుమతి ఇస్తే చెన్నై వెళ్తానని అన్నారు.












Click it and Unblock the Notifications