మునుగోడులో బహుముఖ వ్యూహంతో బీజేపీ.. ప్రత్యర్ధులకు చెక్ పెట్టేలా మాస్టర్ ప్లాన్!!
మునుగోడు ఉప ఎన్నికలకు ప్రధాన పార్టీలన్నీ దూకుడుగా ముందుకు వెళుతున్నాయి. ముఖ్యంగా బిజెపి మునుగోడు ఎన్నికల విజయం సాధించడం కోసం పక్కా ప్రణాళికతో, బహుముఖ వ్యూహాలతో ముందుకు వెళుతుంది.

మునుగోడులో చేరికలపై దృష్టితో పాటు బీజేపీ బహుముఖ వ్యూహాలు
మునుగోడు నియోజకవర్గ ప్రజల మద్దతు కూడగట్టడం కోసం ప్రజాక్షేత్రంలో ప్రచారం పై దృష్టిసారించిన బిజెపి, మరోవైపు చేరికల పైన కూడా ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న బలమైన నాయకులను బీజేపీలో చేర్చుకోవడం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
అంతేకాదు మునుగోడులో ప్రచారంలో భాగంగా ఇంటింటికి బిజెపి నాయకులు ప్రచారం చేసేలా, ప్రజల మద్దతును కూడగట్టేలా ప్రయత్నం చేస్తుంది. క్షేత్ర స్థాయిలో బిజెపి నాయకులను రంగంలోకి దింపి ప్రతి ఇంట్లోనూ బిజెపికి ఎందుకు ఓటు వెయ్యాలి? టిఆర్ఎస్ పార్టీని ఎందుకు ఓడించాలి? అసలు రాష్ట్రంలో జరుగుతున్నది ఏమిటి అని చెప్పే ప్రయత్నం చేస్తోంది.

నకిలీ ఓటర్లపైన కూడా బీజేపీ ఫోకస్
ఇక ఇదే సమయంలో మునుగోడులో బూత్ లెవల్ కమిటీల ఏర్పాటును వేగవంతం చేసి, నకిలీ ఓటర్ల ఏరివేత పైన కూడా బిజెపి ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడులో 23 వేల కొత్త దరఖాస్తులు ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా వచ్చాయని బిజెపి నేతలు చర్చించి, కచ్చితంగా నకిలీ ఓటర్లను తొలగించేలాగా చర్యలు తీసుకోవాలని, టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో బిజెపిని ఓడించడం కోసం నకిలీ ఓటర్లను రంగంలోకి దింపుతుంది అని అంచనావేసింది. ఈ క్రమంలోనే కచ్చితంగా నకిలీ ఓటర్ల పైన బిజెపి ఫోకస్ చేయనుంది.

189 గ్రామాలలో ప్రజల వద్దకు బీజేపీ
అంతే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా బైక్ ర్యాలీ లను నిర్వహించడంతోపాటు, ఇంటింటికి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న పథకాలను, రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా నిధులు దుర్వినియోగం చేస్తున్న విధానాన్ని తెలియజేయాలనే ప్రయత్నం చేస్తోంది బిజెపి. ఈ క్రమంలోనే సెప్టెంబరు 7వ తేదీ నుండి నియోజకవర్గ వ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించాలని నిర్ణయించారు. మునుగోడు నియోజకవర్గంలోని 189 గ్రామాలలోనూ బైక్ ర్యాలీలతో, ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించిన బిజెపి, పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం కోసం కూడా ప్రయత్నాలు చేస్తుంది.

కులాల వారీగా కార్యక్రమాలపై దృష్టి
మునుగోడు ఉప ఎన్నికల కోసం ప్రచారం చేస్తున్న కార్యకర్తలపై పోలీసు కేసులు నమోదు అవుతున్న క్రమంలో వారికి రక్షణ కల్పించడం కోసం, కోర్టులలో కేసులపై పోరాటం చేయడం కోసం బిజెపి లీగల్ సెల్ ను ఏర్పాటు చేసి ముందుకు వెళ్లనుంది. ఇక కులాల వారీగా కార్యక్రమాలను నిర్వహించాలని కూడా బీజేపీ నిర్ణయించింది. బీజేపీ కీలక నేతలందరూ మునుగోడులో మకాం వేసి వచ్చే ఎన్నికలలో విజయం సాధించాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. బహుముఖ వ్యూహాలతో టిఆర్ఎస్ పార్టీ కి చెక్ పెట్టడానికి, మునుగోడులో కాషాయ జెండా ఎగరవేయడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు.

బహిరంగసభ ఏర్పాటులోనూ కాంగ్రెస్ వెనుకే.. అంతర్గత కలహాలు కాంగ్రెస్ కు మైనస్
ఇక బహిరంగ సభ ఏర్పాటులోనూ కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగుతున్న వలసలు, పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్ములాటలు వెరసి మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వెనుకబడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తుంది. వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నికలలో ఓటమి పాలైతే కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రమాదంలో పడినట్టే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో ఉనికి కోసం ఏ విధంగా పోరాటం చేయబోతోంది అనేది తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications