షాపింగ్ నుంచి వస్తుంటే: వెంబడించిన ఆకతాయిలు, ఆటోలో ఎక్కి అసభ్యంగా!
ఆటో డ్రైవర్‌ను బెదిరించి.. లోపల కూర్చున్న ఆకతాయిలు.. అమ్మాయిలను వేధింపులకు గురిచేశారు.
హైదరాబాద్: షాపింగ్ ముగించుకుని ఆటోలో ఇంటికి బయలుదేరిన ఇద్దరు యువతుల పట్ల ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించారు. ఆటో డ్రైవర్ ను బెదిరించి.. లోపల కూర్చున్న ఆకతాయిలు.. అమ్మాయిలను వేధింపులకు గురిచేశారు. అంతేకాదు, విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరింపులకు కూడా దిగారు.
బాధితురాలి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జైరా భాను అనే యువతి షాపింగ్ ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో.. ఆరుగురు యువకులు ఆమె ప్రయాణిస్తున్న ఆటోను వెంబడించారు.

మార్గమధ్యలో ఆటోను అడ్డగించి.. బలవంతంగా ఆటోలోకి ఎక్కారు. యువతుల పట్ల దురుసుగా ప్రవర్తించి.. బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఆకతాయిల్లో ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాలంటూ బలవంతపెడుతూ అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధిత యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. ఘటనను తన సెల్ ఫోన్‌లో చిత్రీకరించిన యువతి.. దాన్ని పోలీసులకు అందజేసింది.
కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఆరుగురు నిందితుల్లో ముగ్గురిని ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితులు శాస్త్రిపురానికి చెందిన వారుగా గుర్తించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications