కాళేశ్వరంపై సీబీఐ విచారణకు బ్రేక్.. కేసీఆర్, హరీష్ రావులకు బిగ్ రిలీఫ్!
తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు పై ఏర్పాటుచేసిన జస్టిస్ పిసి ఘోష్ కమీషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో దీనిపైన చర్చ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణను cbi అప్పగించనున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ వ్యవహారంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది. ఈ వ్యవహారంలో కోర్టు మెట్లెక్కిన కేసీఆర్, హరీష్ రావులకు తాజాగా హైకోర్టు ఆదేశాలతో కాస్త ఊరట దక్కింది.
జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ పై బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్
కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ ఇచ్చిన నివేదిక చిత్తు కాగితంతో సమానమని, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కావాలని బురద చల్లే చర్య అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది. ఇక దీనిపై కాంగ్రెస్ నాయకులు సైతం గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా దండుకోవాలనే ఆలోచనతోనే కాళేశ్వరం నిర్మించారని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.

హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావుల పిటీషన్లు
అందుకు ఆధారాలు పీసీ ఘోష్ కమీషన్ సేకరించిందని పేర్కొన్నారు. అవినీతి చెయ్యకుంటే సీబీఐ విచారణ అంటే భయం దేనికని ప్రశ్నించారు. సీబీఐ విచారణలో అసలు నిజానిజాల నిగ్గు తేలుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరిపిస్తామని అసెంబ్లీలో చేసిన ప్రకటనను సవాలు చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది.
హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించవద్దని ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ చేపట్టవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కెసిఆర్, హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశించింది. అయితే కెసిఆర్ హరీష్ రావు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లకు విచారణ అర్హత లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు.
అక్టోబర్ 7న తదుపరి విచారణ చేస్తామని వెల్లడి
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినందున ప్రభుత్వం దీనిని విచారణ చేయడానికి సీబీఐకి అప్పగించనున్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు. ఎన్ డి ఎస్ ఏ నివేదిక ఆధారంగా సిబిఐ దర్యాప్తు చేపడుతుందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. అయితే అక్టోబర్ ఏడో తేదీ తదుపరి విచారణ చేపడతామని, కోర్టు ఆదేశించడంతో కెసిఆర్, హరీష్ రావు లకు బిగ్ రిలీఫ్ దొరికినట్లు అయింది.












Click it and Unblock the Notifications