ఎత్తు కోసం ఆపరేషన్: ఇప్పుడెమో ఇన్‌ఫెక్షన్, 'కాళ్లు కోసిన డాక్టర్‌ని అరెస్ట్ చేయాలి'
హైదరాబాద్: ఎత్తు పెంచుతామని నిఖిల్ రెడ్డి అనే యువకుడి కాళ్లు కోసిన డాక్టర్‌ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతురావు మంగళవారం సాయంత్రం గ్లోబల్ ఆసుపత్రి ఎదుట ధర్నాకు దిగారు. ఎత్తు పెరిగేందుకు గ్లోబల్ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న నిఖిల్ రెడ్డిని మంగళవారం ఆయన పరామర్శించారు.
అనంతరం నిఖిల్ రెడ్డి తండ్రి గోవర్దన్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌రావు తదితరులతో కలిసి లక్డీకపూల్‌లోని గ్లోబల్ ఆసుపత్రి ఎదుట ఆయన భైఠాయించి, ఆందోళన నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇంటర్‌నెట్‌లో చూసి తెలిసో తెలియకో ఆసుపత్రికి వస్తే పెద్దలకు సమాచారమివ్వకుండా కాళ్లు ఎలా కోస్తారంటూ నిలదీశారు.

నిఖిల్‌రెడ్డిని మభ్యపెట్టి అవసరంలేకున్నా ఆపరేషన్ నిర్వహించి అతడి జీవితంతో ఆడుకున్నారని, ఆపరేషన్ చేసిన డాక్టర్‌ను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ వైద్యుడిని అరెస్ట్ చేస్తేనే మరొకరికి భయం ఉంటుందని అన్నారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కూడా గ్లోబల్ ఆసుపత్రి తీరును తప్పుబట్టిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆపరేషన్ చేసిన వైద్యుడిని పోలీసులు అరెస్టు చేసేవరకు తాను ఆందోళనను విరమించనని విహెచ్ బీష్మించుకు కూర్చున్నారు. 5.7 అడుగులాల ఎత్తున్న నిఖిల్‌రెడ్డికి అవసరం లేకున్నా వైద్యులు అత్యుత్సాహపడి డబ్బు కోసం ఆపరేషన్ చేశారని ఆరోపించారు.
ఆపరేషన్ తర్వాత మూడు రోజుల్లో లేస్తాడన్నారని, మూడ నెలలైనా కాలు కదపని స్థితిలో ఉన్నాడని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో పురోగతి లేకపోతే 24 గంటల్లో మళ్లీ ధర్నాకు దిగుతామని చెప్పారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

ఇలాంటి చికిత్సలు ఏ కార్పొరేట్ ఆసుపత్రి నిర్వహించకుండా ఉండాలంటే గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. నిఖిల్‌రెడ్డి తండ్రి గోవర్థన్‌రెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎత్తు పెరిగిందని ప్రకటనలు ఇచ్చుకోవడంలో ఎలాంటి నిజం లేదన్నారు.
ఆపరేషన్ సక్సెస్ అని ఇప్పుడు ఇన్‌ఫెక్షన్ వస్తోందని శస్త్ర చికిత్స నిర్వహించిన వైద్యుడు చెబుతున్నారని తెలిపారు. ఇంటికి వచ్చి పరీక్షిస్తామని చెప్పి ఇప్పుడు మీరే ఆసుపత్రికి వచ్చి చూపించుకోవాలని అంటున్నారని ఆవేదన చెందారు. చివరకు మెడికల్ కౌన్సిల్ నివేదికలో వైద్యుల తప్పున్నట్లు తేలితే చర్యలు తీసుకుంటామని సైఫాబాద్ ఇన్‌స్పెక్టర్ పూర్ణచందర్ వీహెచ్‌కు హామీ ఇవ్వడంతో ఆయన ధర్నాను విరమించారు.
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లేఖ
ఎత్తు పెరగడం కోసం గ్లోబల్ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించుకున్న నిఖిల్ రెడ్డి తండ్రి గోవర్ధన్‌రెడ్డికి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లేఖ రాసింది. గోవర్ధన్‌రెడ్డి ఫిర్యాదును ఎథిక్స్ కమిటీ పరిగణలోకి తీసుకుంది. నిఖిల్ పరిస్థితిపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వివరణ కోరింది.












Click it and Unblock the Notifications