పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు... నర్సంపేట బంద్.. ఉద్రిక్తత!
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, ఉద్యమకారుడు, దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటు వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. నర్సంపేటలో ఉద్రిక్తతలకు కారణమైంది. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం తర్వాత ఒక ప్రైవేటు భూమిలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విగ్రహ గద్దెను నిర్మించారు బిఆర్ఎస్ శ్రేణులు. అయితే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటే అనుమతి తీసుకోవాలని మున్సిపల్ అధికారులు ఆ గద్దెను కూల్చివేశారు.
నర్సంపేటలో పొలిటికల్ హీట్
ఆ తర్వాత మళ్లీ బిఆర్ఎస్ శ్రేణులు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో, మున్సిపల్ అధికారులు మళ్ళీ విగ్రహాన్ని తొలగించారు. దీంతో నర్సంపేటలో పొలిటికల్ హీట్ పెరిగింది. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత నేతపెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన నేపథ్యంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మను బిఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేశారు. భారీ ఎత్తున ధర్నాలు నిర్వహించారు.

నేడు నర్సంపేట బంద్
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్, హరీష్ రావులు దివంగత నేత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు చర్యను తీవ్రంగా ఖండించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని మున్సిపల్ అధికారులు తొలగించడంతో బిఆర్ఎస్ నేడు నర్సంపేట బంద్ కు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం నుండి నర్సంపేటలోపెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపును నిరసిస్తూ బిఆర్ఎస్ శ్రేణులు భారీ ర్యాలీలు నిర్వహించడంతో నర్సంపేటలో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
నర్సంపేటలో 1500మంది పోలీసులతో భారీ బందోబస్తు
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నర్సంపేటలో 1500మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని వరంగల్ పోలీస్ కమిషనర్ పరిశీలిస్తున్నారు. నర్సంపేట కు తరలి వెళ్లడానికి ప్రయత్నం చేసిన బి ఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. అయితే నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేయడాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు.
దొంతి మాధవరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
దిష్టిబొమ్మ దహనం చేసిన మాదన్నపేటలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీఆర్ఎస్ నాయకులు శవ రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. దిష్టిబొమ్మలు దగ్ధం చేయడం అనాగరిక చర్యని వారన్నారు. ఇలా అధికార ప్రతిపక్ష పార్టీలు నాయకుల ఆందోళనలతో నర్సంపేటలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.














Click it and Unblock the Notifications