రేవంత్ కు సొంత జిల్లాలో కేసీఆర్ షాక్ - తొలి విజయం..!!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ కు బీఆర్ఎస్ తొలి షాక్ ఇచ్చింది. తాజాగా జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లోనూ హోరా హోరీ పోరు సాగింది. ఈ నెల 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లోనూ అనూహ్య అంచనాలు తెర మీదకు వచ్చాయి. ఈ సమయంలోనే రేవంత్ సొంత జిల్లా మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ బై పోల్ లో బీఆర్‌ఎస్ అభ్యర్ది నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు.
రేవంత్ కు షాక్
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ముందే రేవంత్ కు షాక్ తగిలింది. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది. పార్టీ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి 111 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందడంతో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. ఈ ఫలితంలో సొంత జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. తిరిగి తమ స్థానాన్ని నిలబెట్టుకోవడంతో బీఆర్‌ఎస్ క్యాంపులో చాలా రోజుల తరువాత కొత్త జోష్ కనిపిస్తోంది.

బీఆర్ఎస్ విజయం
ఉమ్మడి జిల్లా స్థానిక ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా ఉన్న కశిరెడ్డి నారాయణరెడ్డి గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మారడం.. కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో మార్చి 28న ఎన్నికలు నిర్వహించారు. బీఆర్‌ఎస్ తరఫున నవీన్‌కుమార్ రెడ్డి పోటీ చేయగా, కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్‌గౌడ్ బరిలో నిలిచారు. ఈ పోటీకి బీజేపీ దూరంగా ఉన్నది. మొత్తం 1437 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, ఇద్దరు ఎంపీటీసీలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
మారుతున్న లెక్కలు
ఈ ఎన్నికల్లో కౌంటింగ్ లో అనూహ్య ఫలితాలు వెల్లడయ్యాయి. 21 చెల్లని ఓట్లను గుర్తించారు. బీఆర్ఎస్ అభ్యర్ది నవీన్ కుమార్ రెడ్డికి 763 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్దికి 652 ఓట్లు పోలయ్యాయి. కాగా, స్వతంత్ర అభ్యర్దికి ఒక్క ఓటు మాత్రమే దక్కింది. దీంతో...రేవంత్ పైన బీఆర్ఎస్ కు తొలి విజయం దక్కింది. ఇక...పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా తాజాగా జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మూడు పార్టీలు హోరా హోరీగా తలపడ్డాయి. ఫలితాల పైన భారీ అంచనాలతో ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ తో మరింత ఆసక్తి పెరిగింది. దీంతో..ఇప్పుడు 4న వెల్లడి కానున్న ఫలితాల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications