జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా అనూహ్య ఎంపిక- సర్వే ఎఫెక్ట్..!!
తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటు జూబ్లీహిల్స్ బై పోల్ కు వచ్చే నెల తొలి వారంలో ప్రకటన రానుంది. ఈ క్రమంలో ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. సిట్టింగ్ స్థానం నిలబెట్టుకొనేందుకు బీఆర్ఎస్ ముందస్తుగానే ప్రచారం ప్రారంభించింది. అభ్యర్ధి విషయంలోనూ సర్వే అధారంగా అనూహ్య నిర్ణయం తీసుకుంది. అటు కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లో గెలుపు కోసం కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది.
జూబ్లీహిల్స్ లో సిట్టింగ్ స్థానం లో తిరిగి గెలిచేందుకు బీఆర్ఎస్ కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. తమ పార్టీ అభ్యర్ధిని ఖరారు చేసింది. కొంత కాలంగా గులాబీ పార్టీ అభ్యర్ధి విషయంలో అనేక చర్చ లు తెర మీదకు వచ్చాయి. మాగంటి గోపీనాధ్ భార్య... ఆయన సోదరుడు పేర్ల పైన కుటుంబ సభ్యులతో బీఆర్ఎస్ నేతలు చర్చించారు. అదే సమయంలో నియోజకవర్గంలో పరిస్థితుల పైన సర్వే చేయించారు. నియోజకవర్గంలో గోపీనాథ్ మరణంతో ఏర్పడిన సానుభూతితో పాటుగా పార్టీకి ఉన్న ఓట్ బ్యాంక్ కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా గోపీనాథ్ సతీమణి సునీతను బీఆర్ఎస్ అభ్యర్దిగా అధికారికంగా కేసీఆర్ ప్రకటించారు. జూబ్లీ హిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఇక, కాంగ్రెస్ నుంచి పలువురు నేతలు ఈ సీటు ఆశిస్తున్నారు. తొలి నుంచి రేసులో నిలిచిన అజాహరుద్దీన్ ను పెద్దల సభకు ఎంపిక చేయటం ద్వారా రేసు నుంచి తప్పించారు. అదే విధంగా ఇక్కడ ఎంఐఎం పోటీ కాంగ్రెస్ కు కీలకంగా మారనుంది. స్థానికంగా ఉన్న సామాజిక సమీకరణాలు ఉప ఎన్నికలో కీలకంగా మారనున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చాలామంది రేసులో ఉన్నారని.. సీఎన్ రెడ్డి, బాబా ఫసియుద్దీన్, నవీన్ యాదవ్ , బొంతు రామ్మోహన్‌లతో సహ పలువురు టికెట్ అడుగుతున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
స్థానికులకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఉందని తెలిపారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన మంత్రుల కమిటీ, సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ కూడా కాంగ్రెస్ ఖాతాలోకే వస్తోందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్ధి ఖరారు కావటంతో.. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సైతం తమ అభ్యర్ధులను ప్రకటించనున్నాయి. ఇక ఈ ఉప పోరు ఫలితం ప్రతిష్ఠాత్మకం కానుంది.












Click it and Unblock the Notifications