కేసీఆర్ అనూహ్య నిర్ణయం, నేరుగా రంగంలోకి - టార్గెట్ రేవంత్..!!
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఫాం హౌస్ వీడి ఇక రాజకీయంగా యాక్టివ్ కావాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలకు సిద్దం అవుతున్నారు. ఈ రోజు తెలంగాణ భవన్‌కు రానున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరు కానున్నారు. పార్టీ బలోపేతానికి నిర్ణయాలతో పాటుగా రాజకీయంగా కీలక నిర్ణయం ప్రకటించేందుకు కేసీఆర్ సిద్దం అయినట్లు తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల తర్వాత మళ్లీ బయటకు వచ్చారు. ఈ రోజు(ఆదివారం )బీఆర్‌ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ కార్యకర్తల సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. వాస్తవానికి ఈ సమావేశాన్ని ఈ నెల 19నే నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, పార్లమెంటు సమావేశాలు 19 వరకు కొనసాగడంతో... పార్టీ ఎంపీలు రాలేకపోతారన్న ఉద్దేశంతో 21వ తేదీకి వాయిదా వేశారు.

చాలా కాలం తర్వాత పార్టీ విస్తృత సమావేశాన్ని నిర్వహిస్తుండడం, పైగా కేసీఆర్ పాల్గొంటుండడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ సంయుక్త సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై చర్చ జరిగే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-నల్లమల సాగర్‌తోపాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపైనా చర్చించనున్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల కృష్ణా జలాలతో సర్దుకు పోవాలనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్‌ఎస్ తప్పుబడుతోంది. తాము 90 టీఎంసీల కోసం పోరాడామని, ఇప్పుడు 45 టీఎంసీలతోనే ఎలా సర్దుకుంటారని ప్రశ్నిస్తోంది. ఈ ప్రాజెక్టుల వ్యవహారంపై ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని పార్టీ నిర్ణయించింది. ఈ సమావేశంలోనే దీనిపై లోతుగా చర్చించి, కార్యాచరణను ప్రకటించనున్నారు.
అదే విధంగా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు.. మున్సిపల్ ఎన్నికల పైన ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. దీంతో.. ఈ ఎన్నికల పైనా పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయాల పైన చేపట్టే నిరసన కార్యక్రమాల్లో తానే స్వయంగా పాల్గొనాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణం, సభ్యత్వ నమోదుపైనా చర్చ జరగనుంది. కేసీఆర్ ప్రకటించే నిర్ణయం పైన ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications