అక్కడ బీఆర్ఎస్ భారీ బహిరంగ సభతో మళ్ళీ కేసీఆర్ 'మహా' దూకుడు!!
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడానికి బిఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసి బిఆర్ఎస్ పేరుతో దేశ రాజకీయాలలో కీలక నేతగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని దేశమంతా అన్ని రాష్ట్రాలలోనూ విస్తరించాలని రంగంలోకి దిగిన కేసీఆర్ ముందు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న సరిహద్దు రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్గడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై దృష్టి సారిస్తున్న కేసీఆర్ ప్రస్తుతం టార్గెట్ మహారాష్ట్ర అంటున్నారు. మహారాష్ట్రలో పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయించుకున్న కేసీఆర్ మరోమారు మహారాష్ట్రలో బహిరంగ సభను నిర్వహించనున్నారు.

మార్చి 26వ తేదీన మహారాష్ట్రలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
ఇప్పటికే మహారాష్ట్ర వేదికగా గతంలో ఒకమారు సభను నిర్వహించిన కేసీఆర్ అప్పుడు మహారాష్ట్రలో ముఖ్యమైన నాయకులను తమ పార్టీలోకి చేర్చుకున్నారు. ఇక ప్రస్తుతం మరో మారు మహారాష్ట్ర కేంద్రంగా సభను నిర్వహించాలని భావిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని నాందేడ్ లో బిఆర్ఎస్ తొలి బహిరంగ సభను నిర్వహించగా మళ్లీ మార్చి 26వ తేదీన మహారాష్ట్రలోని కందర్ లోహాలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభలో సీఎం కేసీఆర్ ప్రధానంగా ప్రసంగించనున్నారు.

మళ్ళీ మహారాష్ట్ర వేదికగా సభ .. కారణం ఇదే
మహారాష్ట్రలో నిర్వహించబోయే రెండవ సభలోనూ మహారాష్ట్ర రాజకీయ నాయకుల చేరికలు ఉండబోతున్నాయని సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించి ఆ రాష్ట్రంలోని బిఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమై చర్చలు జరిపారు. మార్చి 26వ తేదీన నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించి మహారాష్ట్ర నేతలు శంకరన్న డోండ్గే, దత్త పవార్ తో పాటు పలువురు ముఖ్య నాయకులతో కెసిఆర్ సమాలోచనలు జరిపారు. నిన్న వారు హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ ను కలిసి చర్చలు జరిపారు.

అవకాశం ఉన్న చోట పార్టీ విస్తరణకు కేసీఆర్ ప్లాన్
ముఖ్యంగా ఈసారి నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ నుండి, ఎన్సీపీ నుండి పలువురు సీనియర్ నాయకులు ఆ పార్టీలకు రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరడానికి రెడీ అయినట్లుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే మళ్లీ రెండో మారు మహారాష్ట్ర ను టార్గెట్ చేసుకున్న కేసీఆర్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కావడానికి అవకాశం ఉన్నచోట మొదట కేసీఆర్ దృష్టి సారించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఒకసారి నాందేడ్ వేదికగా సభ నిర్వహించినప్పటికీ, మళ్లీ మహారాష్ట్ర వైపే మళ్ళీ కెసిఆర్ చూస్తున్నట్లుగా తెలుస్తుంది.

మహాలో బలంగా పాదం మోపే వ్యూహంలో కేసీఆర్
తెలంగాణ మోడల్ అభివృద్ధితో, పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంటున్న కేసీఆర్ మహారాష్ట్రలో బలంగా పాదం మోపడానికి మరో మారు నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదిక కానుంది. అందుకు అక్కడ ఉన్న నాయకులలో ఉన్న ఉత్సాహం, వారికి బీఆర్ఎస్ పట్ల ఉన్న ఆకర్షణ ప్రధాన కారణంగా కనిపిస్తుంది.












Click it and Unblock the Notifications