ఎన్డీఏ అంటే..: అర్థం చెప్పిన కవిత: నిర్మలా సీతారామన్‌పై సెటైర్లతో..!!
తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ చేసిన విమర్శలను బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తిప్పి కొట్టారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలపై కౌంటర్లు పడుతున్నాయి. మోదీ హయాంలో దేశం లక్షల కోట్ల రూపాయల మేర అప్పులు చేసిందంటూ భారత్ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన విమర్శలను నిర్మలా సీతారామన్ తప్పుపట్టారు. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో అప్పటికే వైద్య కళాశాలలు ఉన్నందున తెలంగాణకు కొత్తవి కేటాయించలేదని అన్నారు.

కవిత కౌంటర్..
మెడికల్ కాలేజీలు ఏఏ జిల్లాల్లో ఉన్నాయో కేసీఆర్‌కే తెలియదంటూ నిర్మలా సీతారామన్ విమర్శించారు. 2014లో తెలంగాణ బడ్జెట్ 60,000 కోట్ల రూపాయలు ఉంటే, ఇప్పుడు మూడు లక్షల కోట్ల రూపాయలు దాటిందని విమర్శించారు. దీనిపై బీఆర్ఎస్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఎదురుదాడికి దిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో చేసిన అప్పుల చిట్టాను విప్పారు.

ఎన్డీఏ అంటే..
ఎన్డీఏ అంటే.. నో డేటా అవైలబుల్ అని కవిత ఎద్దేవా చేశారు. పెద్ద నోట్ల రద్దు, దేశ ప్రజల తలసరి ఆదాయం, తలసరి రుణాలు, సమాచార హక్కు చట్టం, జనాభా గణన వంటి అంశాలకు సంబంధించిన ఏ ఒక్క డేటా కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద లేదని ధ్వజమెత్తారు. బీజేపీయేతర ప్రభుత్వాలు చేసిన అప్పుల గురించి చెప్పడానికి మాత్రం డేటా ఎలా వచ్చిందని నిలదీశారు.

బీజేపీ రాష్ట్రాల్లో
పెట్రోల్, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాలని చెప్పిన నిర్మలా సీతారామన్.. సొంత పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను ఎందుకు ఒప్పించలేకపోయిందని సూటిగా ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేశంలో జనాభా గణన జరగలేదని కవిత గుర్తు చేశారు. తాము ఆర్థిక వ్యవస్థలో చైనాతో పోటీ పడుతున్నామని, చైనా ఆర్థిక వ్యవస్థ 18 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉందని ఎప్పుడూ చెప్పే నిర్మలా సీతారామన్.. అయిదు లక్షల ట్రలియన్ టన్నులకే ఎందుకు ఆగిపోయారని ప్రశ్నించారు.

155 లక్షల కోట్ల అప్పు..
చైనాతో పోల్చుకుంటే దేశంలో చాలా వనరులు ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్ని ఎందుకు సాధించట్లేదని కవిత నిలదీశారు. 2014కి ముందు భారత్ చేసిన అప్పులు 55 లక్షల కోట్ల రూపాయల మేర ఉండగా.. మోదీ ప్రధానిగా వచ్చిన తరువాత ఆ సంఖ్య 155 లక్షల కోట్లకు చేరిందని గుర్తు చేశారు. ఎకానమి గురించి మోదీ ప్రభుత్వం వద్ద నేర్చుకోవాల్సిన దుస్థితి లేదని అన్నారు.

జీడీపీ వాటా..
తెలంగాణ ప్రభుత్వం అనేక విప్లవాత్మక విధానాలు రూపొందించిందని, దేశ జీడీపీలో 4.5 శాతం తెలంగాణా వాటా ఉందని కవిత పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్లే అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయని, తమ చేతగానితనాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై రుద్దే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాలను నిందించడం నిర్మల సీతారామన్ కు బాగా అలవాటైందని ఎద్దేవా చేశారు. ఎంపిక చేసిన రాష్ట్రాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూర్చుతుందని, మెడికల్ కాలేజీలను కేటాయిస్తుందని అన్నారు.












Click it and Unblock the Notifications