జన్వాడ ఫాంహౌస్ నాది కాదు: అలా ఐతే కూల్చివేయాలంటూ కేటీఆర్ తేల్చేశారు
తెలంగాణలో మరోసారి ఓ 'ఫాంహౌస్' రాజకీయంగా చర్చకు దారితీసింది. అదే జన్వాడ ఫాంహౌస్. అది మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేనంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుండగా.. కాదని కొట్టిపారేస్తోంది బీఆర్ఎస్. తాజాగా, కేటీఆర్ స్పందించారు. తన పేరు మీద ఎలాంటి ఫాంహౌస్ లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. మిత్రుడికి చెందిన ఫాంహౌస్‌ను లీజుకు తీసుకుని ఉంటున్నట్లు వెల్లడించారు. ఎఫ్టీఎల్, బఫర్‌లో ఫాంహౌస్ ఉంటే తానే దగ్గరుండి కూల్చివేయిస్తానని తెలిపారు.
ఒకవేళ తప్పు ఉంటే అక్రమ కట్టడాలు కూల్చివేస్తే తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. మంచి జరగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సిందేనన్నారు. అంతేగాక, మంత్రులు, పెద్దపెద్ద కాంగ్రెస్ నేతలు అక్రమంగా కట్టిన ఫాంహౌస్‌లు చూపిస్తానని కేటీఆర్ తెలిపారు. మంత్రి పొంగులేటికి ఎఫ్‌టీఎల్‌లో ఫాంహౌస్ ఉందని ఆరోపించారు. కేవీపీ, పట్నం మహేందర్ రెడ్డి, సుఖేందర్‌రెడ్డికి ఎఫ్‌టీఎల్‌లో ఫాంహౌస్ ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఫాంహౌస్ ఉన్నట్లు కేటీఆర్ ఆరోపించారు.

తప్పు జరిగితే కూల్చివేతకు దగ్గరుండి సహకరిస్తానన్న కేటీఆర్.. ఇతర అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తప్పు తాను చేసినా కాంగ్రెస్ వాళ్లు చేసినా చర్యలు తీసుకోవాల్సిందేనని కేటీఆర్ డిమాండ్ చేశారు. తన అఫిడవిట్లో ఏముందో పబ్లిక్ డాక్యుమెంట్ చూసుకోవచ్చన్నారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ గురువారం చేవెళ్లలో బీఆర్ఎస్ చేపట్టే నిరసనలో పాల్గొంటానన్నారు.
ఇది ఇలావుండగా, జన్వాడ ఫాం హౌస్ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోన్న విషయం తెలిసిందే. జన్వాడ ఫాంహౌస్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉండటంతో కూల్చే అవకాశం ఉందని పిటిషన్లో తెలిపారు.
హైడ్రా కూల్చకుండా స్టే ఇవ్వాలని హైకోర్టులో ప్రదీప్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లో ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, హైడ్రా కమిషనర్లను చేర్చారు. అలాగే రంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులను, శంకర్ పల్లి రెవెన్యూ అధికారి, చీఫ్ ఇంజినీర్‌ను కూడా ప్రతివాదులుగా తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే కోర్టు స్టే ఇవ్వకుండా హైడ్రా తీసుకున్న చర్యలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications