స్థానిక ఎన్నికల వేళ గేరు మార్చిన బీఆర్ఎస్, టార్గెట్ రేవంత్..!!
తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు రంగం సిద్దమైంది. ఒకటి రెండు రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఇప్పటికే రిజర్వేషన్ల ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక, బీఆర్ఎస్ సైతం స్థానిక ఎన్నికల వేళ కొత్త ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా బీసీ నేతలతో కీలక భేటీ ఏర్పాటు చేసారు. సీఎం రేవంత్ లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు అమలుకు సిద్దమైంది.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల జీవోను హైకోర్టు కొట్టి వేసింది. 50 శాతం రిజర్వేషన్లకు లోబడి ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఇప్పుడు పంచాయితీ ఎన్నికల వేళ బీసీ రిజర్వేషన్ల అంశం పైన బీఆర్ఎస్ కొత్త వ్యూహలను అమలు చేస్తోంది. అందు లో భాగంగా కేటీఆర్, హరీశ్‌రావు సమక్షంలో రేపు బీఆర్‌ఎస్ బీసీ ముఖ్య నేతల సమావేశం కాను న్నారు. కాగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీల ఒత్తిడి తర్వాత డెడికేటెడ్ కమిషన్‌ను వేశారని చెప్పుకొచ్చారు. డెడికేటెడ్ కమిషన్ నివేదికను ఇంకా ప్రజలకు అందుబాటులో ఉంచలేదని పేర్కొన్నారు. ఇంతలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హడావుడిగా జీవో ఇచ్చారని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వం ఆ జీవో తీసుకొచ్చే సమయంలో ఆ జీవో చెల్లదని బీఆర్‌ఎస్ నాయకులు చెప్పినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. తీరా చూస్తే ఆ జీవోను హైకోర్టు కొట్టివేసిందని తెలిపారు. ఇప్పుడు పంచాయతీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఇచ్చిన జీవో నిలబడుతుందా అని తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తేనే స్థానిక సంస్థల ఎన్నికలకు ఒప్పుకుంటామని ఆయన స్పష్టం చేశారు. పార్టీ గుర్తులు లేకుండా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని.. అలాంటి ఈ ఎన్నికల్లో పార్టీపరంగా రిజర్వేషన్లు ఇస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ మేధావులు, ప్రజాసంఘాలతో కలిసి జిల్లాల్లో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. 75 ఏండ్ల తర్వాత కూడా బీసీలు ఇంకా భిక్షమెత్తుకోవాలా అని నిలదీశారు. నూటికి 50 శాతానికి పైగా జనం ఉన్న బీసీలు ఉద్యమం చేస్తారని వెల్లడించారు. బీసీల భవిష్యత్ కార్యాచరణను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు.












Click it and Unblock the Notifications