బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు హౌస్ అరెస్ట్, భారీగా పోలీసులు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు గృహనిర్భంధం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి, కోకాపేటలోని వారి నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కేటీఆర్, హరీశ్ రావును ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు నేపథ్యంలో ఆందోళనలు జరగకుండా బీఆర్‌ఎస్ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. కాగా, పాడి కౌశిక్ రెడ్డిని సోమవారం కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆదివారం కరీంనగర్ కలెక్టరేట్‌లో మంత్రులు నిర్వహించిన సమీక్ష సందర్భంగా.. కౌశిక్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాడులు చేసుకునేవరకు వెళ్లడంతో సమావేశం రసాభాసగా మారింది.

ఈ క్రమంలో పలు ఫిర్యాదులు అందడంతో కరీంనగర్ పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కరీంనగర్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ పోలీసులు సోమవారం సాయంత్రం హైదరాబాద్ వచ్చి పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు.
కాగా, మంగళవారం పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరైంది. కరీంనగర్‌లో రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రేమలత ముందు మంగళవారం ఉదయం హాజరుపర్చగా.. 3 కేసుల్లో షరలతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. గురువారంలోకా రూ. 2 లక్షలు పూచీకత్తు సమర్పించాలని ఆదేశాలిచ్చారు. పోలీసులు పిలిచిన సమయంలో విచారణకు హాజరుకావాలన్నారు. ఈ క్రమంలో మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని కోర్టుకు కౌశిక్ రెడ్డి తెలిపారు. అంతకుముందు కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరిచేవరకూ ప్రశ్నిస్తూనే ఉంటానన్నారు. కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications