కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్‌తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ షాక్
Revanth Reddy: లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వలసలు, చేరికలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి- ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి వలసల బెడదను ఎదుర్కొంటోంది. అధికారాన్ని కోల్పోయాక పలువురు సీనియర్లు బీఆర్ఎస్‌ను వీడారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం దీనికి మినహాయింపు కాదు.
ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ నాయకులు పార్టీని వీడారు. బీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు కూతురు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. కేశవరావు కూడా కాంగ్రెస్‌లో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలను ఆయన ధృవీకరించారు కూడా.

బీఆర్ఎస్‌కే చెందిన మరో సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పడం, కూతురు కడియం కావ్యతో సహా కాంగ్రెస్‌లో చేరారు. వరంగల్ లోక్‌సభ టికెట్‌ను కేటాయించిన తరువాత కూడా ఆమె దాన్ని వదులుకుని మరీ పార్టీని వీడారు. అదే వరంగల్ లోక్‌సభలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధికి చెందిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఇప్పటికే పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అదే బాటలో మరో ఎమ్మెల్యే నడవనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్‌కు చెందిన బీఆర్ఎస్ శాసన సభ్యుడు టీ ప్రకాష్ గౌడ్.. పార్టీకి గుడ్‌బై చెప్పబోతోన్నారు.
ఈ ఉదయం ఆయన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సాయంత్రం గాంధీభవన్‌లో ఆయన సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఇప్పటివరకు నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టవుతుంది.

రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా నాలుగు సార్లు విజయం సాధించారు ప్రకాష్ గౌడ్. 2009లో ఈ నియోజకవర్గం ఆవిర్భవించినప్పటి నుంచీ ఆయనే వరుసగా గెలుస్తూ వస్తోన్నారు. తొలి రెండుసార్లు అంటే 2009, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. అనంతరం పార్టీ ఫిరాయించారు. బీఆర్ఎస్‌లో చేరారు. 2018, 2023లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గులాబీ జెండా ఎగరేశారు.
అలాంటి బలమైన నాయకుడు పార్టీని వీడబోతోండటం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్‌కు పెద్ద దెబ్బే అవుతుంది. గ్రేటర్‌లో ఈ వలసలు ప్రకాష్ గౌడ్‌తో ఆగకపోవచ్చని, మరి కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటోన్నారంటూ సమాచారం.












Click it and Unblock the Notifications