టీటీడీపీలోకి ఆ ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ?చంద్రబాబుతో చర్చలు..!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు ఇంటికి వెళ్లిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు, ఓ మాజీ ఎమ్మెల్యే ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. దీంతో ఈ ముగ్గురూ త్వరలో టీటీడీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇవాళ ఆయనతో భేటీ అయ్యారు. తాజా రాజకీయాలు, ఇతర అంశాలపై చర్చించారు. అనంతరం బయటికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి తాను త్వరలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం స్పందించలేదు. తన మనవరాలి పెళ్లికి ఆహ్వానించేందుకే చంద్రబాబును కలిసినట్లు మల్లారెడ్డి తెలిపారు.

గతంలో టీడీపీలో చంద్రబాబు నేతృత్వంలో పనిచేసిన ఈ ముగ్గురు నేతలు.. ఆ తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీ బలహీనం కావడంతో బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సర్కార్ నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో తిరిగి సీఎం రేవంత్ రెడ్డి గురువైన చంద్రబాబు పార్టీ టీటీడీపీలో చేరిపోతే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురూ చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications