మళ్లీ సుప్రీంకోర్టుకు కవిత- ఈడీ నోటీసుల నేపథ్యంలో..!!
బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత మరోసారి సుప్రీంకోర్టు గడప తొక్కనున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ విచారణను నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ శుక్రవారం అత్యవసర పిటీషన్ వేయనున్నారు.
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటోన్న భారత్ రాష్ట్ర సమితి శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఇవ్వాళ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు వ్యతిరేకంగా పిటీషన్ వేశారు. దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 24వ తేదీన లిస్టింగ్ చేసింది. ఆ రోజున విచారిస్తామని తెలిపింది.
ఈ నెల 24వ తేదీన లిస్టింగ్ అయిన విచారణను శుక్రవారమే చేపట్టాలని కోరుతూ కవిత తాజాగా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఆమె తరఫు న్యాయవాది వందన సెహగల్ ఈ మేరకు అర్జంట్ పిటీషన్ ను దాఖలు చేయనున్నారు. అత్యవసరంగా దీనిపై విచారణ చేపట్టాలని మరోసారి అభ్యర్థించనున్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే లిస్టింగ్ చేసినందున దీన్ని ముందుకు జరుపుతుందా? లేదా? అనేది చర్చనీయాంశమైంది.

ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటోన్నారు కవిత. ఈ నెల 11వ తేదీన సుమారు తొమ్మిది గంటల పాటు ఆమెను విచారించారు ఈడీ అధికారులు. న్యూఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఈ విచారణ కొనసాగింది. రెండో విడతలో ఇవ్వాళ కూడా విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ.. అది సాధ్యపడలేదు. ఈడీ విచారణకు హాజరుకాలేదామె. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున తాను హాజరుకాలేనని స్పష్టం చేశారు.
దీనితో కవితకు మరోసారి విచారణకు పిలిపించారు. ఈ నెల 20వ తేదీన తమ కార్యాలయానికి రావాల్సి ఉంటుందంటూ ఈడీ అధికారులు ఇవ్వాళే నోటీసులను జారీ చేశారు. దీనితో ఆమె అప్రమత్తం అయ్యారు. ఈ నెల 24వ తేదీన లిస్టింగ్ అయిన తన పిటీషన్ పై విచారణను శుక్రవారమే చేపట్టాలని అభ్యర్థించనున్నారు.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ సారథ్యంలోని ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం కవిత పిటీషన్ ను విచారించనుంది. ఇప్పటికిప్పుడు ఈడీ విచారణను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయడానికి సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఎఫ్ఐఆర్ లో తన పేరు లేనప్పటికీ- ఉద్దేశపూరకంగా తనకు నోటీసులను పంపిస్తోన్నారంటూ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications