బీజేపీలో చేరిన మరో బీఆర్ఎస్ ఎంపీ - సీటు ఖరారు..!!
పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసాయి. వరుసగా బీఆర్ఎస్ ఎంపీలు బీజేపీలో చేరుతున్నారు. నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరిన 24 గంటల్లోనే మరో ఎంపీ కాషాయం కండువా కప్పుకున్నారు. దేశ వ్యాప్తంగా 400 సీట్లు గెలవటం పైన గురి పెట్టిన బీజేపీ ఇతర పార్టీల నుంచి వచ్చే ఎంపీలకు ఛాన్స్
ఇస్తోంది. తెలంగాణలోనూ ఆపరేషన్ కొనసాగిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో మరో ఎంపీ పార్టీకి గుడ్ బై చెప్పారు. సీనియర్ రాజకీయ నాయకుడు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేసారు. బీజేపీ కండువా కప్పుకున్నారు. కేంద్ర మంత్రి చంద్రశేఖర్, బీజేపీ నేతలు తరుణ్ చుగ్ తెలంగాణ బీజేపీ నేతల సమక్షంలో పాటిల్ కు కాషాయం కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. పాటిల్ కొంత కాలంగా బీజీపీ నేతలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. తిరిగి తనకు జహీరాబాద్ సీటు ఇవ్వాలని..అందుకు అంగీకరిస్తే పార్టీ మారేందుకు సిద్దమని చెప్పినట్లు సమాచారం. దీంతో, ఇప్పుడు ఆయన వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు.

బీబీ పాటిల్ వరుసగా 2014, 2019 ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి నాటి టీఆర్ఎస్, తాజాగా బీఆర్ఎస్ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. నియోజకవర్గంలో పట్టు సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తరువాత ఆయనతో బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. తాజాగా ఎంపీ రాములు బీజేపీలో చేరిన తరువాత పాటిల్ కు సీటు పైన హామీ దక్కినట్లు చెబుతున్నారు. ఫలితంగా ఆయన పార్టీలో చేరారని సమాచారం. స్థానికంగా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఎంపీలు బీజేపీ బాట పట్టారు. దీంతో, వచ్చే పార్లమెంట్ ఎన్నికలు బీఆర్ఎస్ నాయకత్వానికి పరీక్షగా మారుతోంది. కేసీఆర్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications