నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలకు గుడ్ బై - రేవంత్ కు కేటీఆర్ సవాల్..!!
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి రేవంత్ కు సవాల్ చేసారు. యూత్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల అమలు పైన నిలదీసారు. తమ హయాంలో కొన్ని పొరపాట్లు జరిగాయని.. సరి చేసుకుంటామని వ్యాఖ్యానించారు. యువత కారణంగానే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని చెప్పుకొచ్చారు. యువతకు అండగా నిలుస్తామని.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చకుంటే సమాధి అవుతుందని హెచ్చరించారు.
సీఎం రేవంత్ లక్ష్యంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ మోసం చేసిన చోటే యువ సంగ్రామ సదస్సును ఏర్పాటు చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అని వ్యాఖ్యానించారు.యువత జంగ్ సైరన్ మోగిస్తోందన్నారు. యువత కదం తొక్కితే ఉద్యమాలు ఉప్పెనలయ్యాయని గుర్తు చేశారు. రేపటి తెలంగాణ నిర్మాతలు ఈ యువతే అని చెప్పుకొచ్చారు. మోసం చేసిన వారికి బుద్ధి చెప్పడానికే సమావేశం పెట్టినట్లు తెలిపారు. సరూర్‌నగర్ స్టేడియం సాక్షిగా యువతను కాంగ్రెస్ దగా చేసిందని విమర్శించారు. ఢిల్లీ నుంచి గాంధీలు వస్తే, గల్లీ నుంచి కల్తీ కాంగ్రెస్ వాళ్లు వచ్చారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పాత కేటుగాళ్లు, కొత్త డూప్లికేట్ గాళ్లు కలిసి నకిలీ డిక్లరేషన్లు ఇచ్చారని మండిపడ్డారు.

పొరపాట్లు జరిగాయి.. సరిదిద్దుకుంటాం
యూత్ డిక్లరేషన్ పేరిట యువతను నయవంచనకు గురిచేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలంటూ మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణలో నోటిఫికేషన్లు లేవని.. లూటిఫికేషన్లు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. అశోక్‌నగర్‌లో రాహుల్‌గాంధీ అబద్ధపు మాటలు చెప్పారని ఆరోపించారు. రాహుల్‌కు తెలుగు రాదని, తెలంగాణ ప్రజల బాధలు అర్థం కావన్నారు. జాబ్ క్యాలెండర్ అంటూ అవినీతి సొమ్ముతో ప్రకటనలిచ్చారని.. ఇప్పుడు జాబుల్లేవని.. ప్రభుత్వం నుంచి ఉలుకులేదు, పలుకులేదంటూ విమర్శలు గుప్పించారు. రేవంత్ జాబులు నింపకుండా, రాహుల్ జేబులు నింపుతున్నారని ఆరోపించారు. అన్నదమ్ముల అల్మరా లను రేవంత్ నింపుతున్నారంటూ వ్యాఖ్యానించారు. హామీలపై ప్రజలు ప్రశ్నిస్తే అవహేళన గా మాట్లాడారని.. అవమానాలు, అవహేళనలను ప్రజలు, యువత ఎప్పటికీ మర్చిపోరన్నారు. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగ పత్రాలిచ్చి.. రేవంత్‌రెడ్డి క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 వేల ఉద్యోగాలిచ్చినట్టు నోటిఫికేషన్లు చూపిస్తే.. శాశ్వతంగా రాజకీయా లను వదిలేస్తానని సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications