Telangana: ఆ నలుగురికే మంత్రి పదవులు..!
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తాజాగా కేబినెట్ విస్తరణ చేయాలని కాంగ్రెస్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్లు చెబుతున్నారు. ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనేదానిపై పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు చర్చలు జరుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నలుగు పేర్లతో జాబితాను అధిష్ఠానానికి అందించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెండు పేర్లతో మరో జాబితాను అందించారు.
దీంతో ఆరు పేర్లలో నలుగురిని ఫైనల్ చేయాలని రాష్ట్ర నేతలకు అధిష్ఠానం స్పష్టం చేసింది. దీంతో ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలనేదాని చర్చలు కొనసాగుతోన్నాయి. రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతానికి నాలుగు మంత్రి పదవులు భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, లంబాడీల నుంచి నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, రాష్ట్రంలో అతిపెద్ద సామాజికవర్గమైన ముదిరాజ్ కు చెందిన వాకిటి శ్రీహరి, మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కూడా మంత్రి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భువనగిరి ఎంపీ సీటును గెలిపించిన తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి పేరు పరిశీలించాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైకమాండ్ ను కోరినట్టు సమాచారం. ఇద్దరు సోదరులకు మంత్రి పదవులు రాకపోవచ్చు. ఒక వేళ కేబినెట్ విస్తరణ చేస్తే శ్రావణ మాసంలో ఉండే అవకాశం ఉంది. పీసీసీ కొత్త చీఫ్ నియామకానికి మరింత టైం పట్టే అవకాశం కనిపిస్తోంది.
కాంగ్రెస్ త్వరలో మరో 4 రాష్ట్రాలకు పీసీసీ అధ్యక్షులను నియమించాల్సి ఉంది. వాటితోపాటే తెలంగాణకు కూడా నియమిస్తామని హైకమాండ్ పేర్కొంది. ఇక కాంగ్రెస్ నేతలు ఎదురుచూస్తున్న నామినేటెడ్ పోస్టులకు ఎంపిక బాధ్యతను హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఉన్నారు.












Click it and Unblock the Notifications