మైనర్ కారుతో వీరంగం: రెండు కార్లు, బైక్ ధ్వంసం
హైదరాబాద్: ఓ మైనర్ బాలుడు అతి వేగంగా కారు నడుపుతూ వీరంగం సృష్టించాడు. ఈ సంఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా రెండు కార్లు, ఓ బైక్ ధ్వంసమయ్యాయి. ఆ సంఘటన హైదరాబాదులోని అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
అదృష్టవశాత్తు ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణం నష్టం కలుగలేదు. ఇటీవల చిన్నారి రమ్య మృతి ఉదంతం నేపథ్యంలో ఈ వార్త నగర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇన్‌స్పెక్టర్ ఏపీ. ఆనంద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..... తార్నాకకు చెందిన ఓ మైనర్ బాగ్‌అంబర్‌పేటలోని ఓ కాలేజీలో ఇంటర్‌ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు.

శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో తన తండ్రి స్కోడా యాక్టివా కారు(ఏపీ26ఏబి0009)ను ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు తీసి తన స్నేహితులతో కలసి షికారుకు బయలు దేరాడు. అతి వేగంగా కారు నడుపుతూ బాగ్‌అంబర్‌పేట డీడీకాలనీ సోమసుందర్‌నగర్‌కు వచ్చాడు.

సోమసుందర్‌నగర్ శ్రీకాముఖి అపార్ట్‌మెంట్ ముందునుంచి నడుచుకుంటూ వస్తున్న ఇంజనీర్ ప్రకాష్ (55)ను ఢీ కొట్టాడు. దీంతో గాబరా పడిన మైనర్ సడన్‌గా కుడివైపు కారును తిప్పాడు. దీంతో అక్కడున్న ఓ మారుతికారు, ఇండిగో కారుతో పాటు ఓ బైక్ ధ్వంసమయ్యాయి. ప్రకాష్ కుడి చేతి ఎముక విరిగిపోడంతో ఆయనను చికిత్స నిమిత్తం యశోదా ఆస్పత్రికి తరలించారు.

అయితే కారులో ఓ మద్యం బాటిల్ లభ్యం కావడంతో బాలుడు మద్యం సేవించాడని భావించిన పోలీసులు అతనికి బ్రీత్‌ఎనలైజర్‌తో పాటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా బాలుడు మద్యం తాగలేదని నిర్థారణ అయ్యింది. కారులో ఉన్న మద్యం బాటిల్‌ను బాలుడి తండ్రి కారులో ఉంచినట్లు విచారణలో వెల్లడైంది. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని 338, 279ఐపీసీ సెక్షన్లతో పాటు 180,181, 130/177 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications