కేంద్రం శుభవార్తలతో తెలంగాణా పంట పండుతుంది!
కేంద్రం జాతీయ రహదారుల విస్తరణకు దృష్టి సారించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జాతీయ రహదారుల విస్తరణపైన ఫోకస్ పెట్టిన కేంద్రం రెండు రాష్ట్రాలలోనూ రవాణా వ్యవస్థను మెరుగుపరిచే, పారిశ్రామిక ప్రగతి సాధ్యమయ్యేలా జాతీయ రహదారుల విస్తరణతో కీలక అడుగులు వేస్తోంది.
మరో జాతీయ రహదారి విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య రోడ్డు కనెక్టివిటీకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలా, సరుకు రవాణా సులభమైన గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణాన్ని చేయాలని తలచిన కేంద్రం ఈ మేరకు డిపిఆర్ సిద్ధం చేయాలని ఆదేశించింది. ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో మరో జాతీయ రహదారి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

ఎన్ హెచ్ 61 విస్తరణ పనులు త్వరలో
నిర్మల్ జగిత్యాల జిల్లాల మధ్య జాతీయరహదారి విస్తరణతో ఆ ప్రాంత రూపురేఖలు మార్చాలని నిర్ణయించిన కేంద్రం రెండవవిడత పనులకు ఆమోదముద్ర వేసింది. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నిర్మల్ జగిత్యాల జాతీయరహదారి ఎన్ హెచ్ 61 విస్తరణ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయి. ఈ జాతీయరహదారి నిర్మాణం పూర్తయితే రెండు జిల్లాల మధ్య ప్రయాణం సులభం అవ్వడమే కాకుండా, మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా రాకపోకలు ఈజీ అవుతాయి.
నిర్మల్ జగిత్యాల జిల్లాల మధ్య మొత్తం 74 కిలోమీటర్ల రహదారి
అంతేకాదు ఈ ప్రాంతంలో భూముల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎన్ హెచ్ 61 జాతీయ రహదారి మహారాష్ట్రలోని కళ్యాణ్ నుండి ప్రారంభమై బైంసా మీదగా నిర్మల్ వరకు నిర్మించబడింది. ఇక నిర్మల్ జగిత్యాల జిల్లాల మధ్య మొత్తం 74 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు ఉండగా 2018లో దీనికి సంబంధించిన ప్రాథమిక సర్వే చేపట్టి 2020లో మొదటి విడత పనుల కోసం నిధులు కేటాయించారు.
రెండవ విడత పనులకు అనుమతి
ప్రస్తుతం నిర్మల్ నుంచి ఖానాపూర్ మండలం బాదన్ కుర్తి వరకు 35 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణం చివరి దశలో ఉంది. ఖానాపూర్ మండలం సుర్జాపూర్ వరకు పనులు దాదాపుగా పూర్తికాగా జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలం ఓబులాపూర్ నుండి జగిత్యాల గ్రామీణ మండలం చల్ గల్ వరకు 39 కిలోమీటర్ల మేర పనులకు అనుమతులు లభించాయి.
ఈ ఎన్ హెచ్ పూర్తయితే పారిశ్రామిక ప్రగతి
దీంతో త్వరలో డి పి ఆర్ పూర్తి చేసి దీనికి సంబంధించి భూసేకరణ చేయనున్నారు అధికారులు. ఈ జాతీయ రహదారి నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని, పారిశ్రామికంగా ప్రగతి సాధిస్తుందని భావిస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాంతంలో భూముల విలువ కూడా పెరుగుతుందని పర్యాటక రంగం వృద్ధి చెందుతుందని, రాష్ట్ర రవాణా వ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications