హైదరాబాద్ నుంచి మూడు బుల్లెట్ ట్రైన్ల రూట్ పై కీలక నిర్ణయం..!!
హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్స్ హబ్ గా మారుతోంది. గత ఏడాది కేంద్ర బడ్జెట్ లో కేంద్రం చేసిన ప్రకటన మేరకు కార్యాచరణ వేగవంతం చేస్తున్నారు. అలైన్ మెంట్ తో పాటుగా భూసేకరణ అంశం పైన ప్రస్తుతం కసరత్తు కొనసాగుతోంది. ప్రతిపాదిత రూట్.. భూ సేకరణ వ్యయం తో పాటుగా రైల్వే శాఖ తీసుకోవాల్సిన నిర్ణయాల పైన సమీక్ష నిర్వహించారు. ఇదే అంశం పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక అంశాలను వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి మూడు బుల్లెట్ ట్రైన్ల కారిడార్లను నిర్మించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-ముంబై కారిడార్లు ఉన్నాయి. కాగా.. ఈ కారిడార్లకు సంబంధించి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అలైన్‌మెంట్లపై అధ్యయనాలు జరుగుతున్నాయని, ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత భూసేకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదని తెలిపారు. ఢిల్లీలో రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కిషన్ రెడ్డి తాజాగా భేటీ అయ్యారు. హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు, ముంబైలకు కనెక్టివిటీ కల్పిస్తూ ప్రతిపాదించిన హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లకు సంబంధించి అలైన్‌మెంట్లపై చర్చించారు. ఈ సందర్భంగా అలైన్‌మెంట్ ఖరారు కోసం చర్యలు తీసుకుంటామని, ఆ తర్వాత భూసేకరణ ప్రారంభమవుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలైన్‌మెంట్ ఫిక్స్ అయిన తర్వాత భూసేకరణ చేపడతామని స్పష్టం చేశారు.

తుది అలైన్ మెంట్ పై కసరత్తు
అదే సమయంలో ప్రతిపాదనలు లేకుండా భూసేకరణ చేపట్టడం చట్టవిరుద్దమని, హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ పేరుతో ఎవరైనా భూమిని సేకరిస్తే అది ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. అలైన్ మెంట్ ఫిక్స్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపుతామని పేర్కొన్నారు. అలైన్‌మెంట్, మార్కింగ్ ప్రక్రియపై స్పష్టత లేకపోవడంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి దృష్టికి కిషన్ రెడ్డి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా అలైన్‌మెంట్ ఖరారు అయిన తర్వాత ప్రభుత్వాలు, రైతులకు పూర్తి సమాచారం అందిస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాగా హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్ ఏపీ మీదుగా వెళ్లనుంది.












Click it and Unblock the Notifications
