Maoists Mass Surrender: లొంగిపోయేందుకు రెడీ-ముహుర్తం ఫిక్స్-మావోయిస్టుల ప్రకటన..!
దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కోసం కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్ ఉధృతంగా కొనసాగుతోంది. ఇప్పటికే కీలక నేతల్ని పోలీసులు వరుసగా ఎన్ కౌంటర్లతో మట్టుబెడుతున్నారు. అదే సమయంలో భారీ ఎత్తున అరెస్టులు, లొంగుబాట్లు కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మావోయిస్టులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమకు ఆలోచించుకోవడానికి సమయం కావాలని 15 రోజుల క్రితం ప్రకటించిన మావోయిస్టులు ఇప్పుడు సామూహికంగా లొంగిపోతామని ప్రకటించారు.
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ఇప్పటికే కేంద్రం భారీ ఎత్తున ఆపరేషన్ కగార్ కొనసాగిస్తోంది. దీంతో మావోయిస్టులు ఆయా రాష్ట్రాల్ని వదిలి ఆంధ్రప్రదేశ్ కు వచ్చి తలదాచుకుంటున్నారు. దీంతో తాజాగా మారేడుమిల్లి అడవుల్లో జరిపిన ఎన్ కౌంటర్ లో అగ్రనేత హిడ్మా సహా ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. అలాగే దేవ్ జీ వంటి వారి ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. మరోవైపు ఏపీలోనే తాజాగా 50 మంది మావోయిస్టుల్ని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు.

తెలంగాణలోనూ భారీ ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఇప్పటికే అగ్రనేతలు మల్లోజుల, ఆశన్న వంటి వారు ఆయుధాలు విడిచి లొంగిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా సమావేశమైన మావోయిస్టులు ఆయుధాలు వదిలేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇందుకు తమకు కాస్త సమయం కావాలని కోరారు. ఇవాళ మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్ ఘడ్(ఎంఎంసీ) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఓ లేఖ విడుదల చేసారు. ఇందులో తాము జనవరి 1న సామూహికంగా లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు వారు తెలిపారు.

జనవరి 1న తాము చేస్తున్న సాయుధ పోరాటాన్ని పక్కనబెట్టి, ఆయుధాలు వదిలేసి ప్రభుత్వం సూచించిన రాష్ట్రంలో లొంగిపోయేందుకు సిద్దంగా ఉన్నట్లు అనంత్ లేఖలో వెల్లడించారు. అయితే అప్పటి వరకూ ఈ మూడు రాష్ట్రాల్లో ఎన్ కౌంటర్లు జరగకుండా చూడాలని మాత్రం కోరారు. ఈ మేరకు ఆయా ప్రభుత్వాలు సంయమనం పాటించాలని వేడుకున్నారు. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లతో పార్టీ బలహీనమైందని, మిగిలిన వారు లొంగిపోవాలని కేంద్రం కోరడంతో తాము దానికి అంగీకరిస్తున్నట్లు లేఖలో వెల్లడించారు.












Click it and Unblock the Notifications