చంద్రబాబు తప్పించుకోలేరు: కడియం, దేవుడు అడ్డొచ్చినా అంటూ సుమన్
హైదరాబాద్: ఎన్ని డ్రామాలు ఆడినా, కేసును నోటుకు ఓటు కేసును పక్కదారి పట్టించలేరని, కేసు నుంచి తప్పించుకోలేరని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి అన్నారు. ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఎసిబి తన పని తాను చేసుకుని పోతుందని ఆయన బుధవారం మీడియాతో అన్నారు.
తమ ప్రభుత్వం ఏ విధమైన ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడలేదని ఆయన స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్‌కు, రికార్డింగ్‌కు తేడా తెలియని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందని ఆయన అపహాస్యం చేసారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటికీ తప్పు చేస్తే విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆయన అన్నారు.
దేవుడు అడ్డొచ్చినా..

హైదరాబాద్‌పై పెత్తనం చెలాయించాలని చూస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్లమెంటు సభ్యుడు బాల్క సుమన్ హెచ్చరించారు. బుధవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఏపీ అభివృద్ధిని గాలికి వదిలేసి పక్క రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
తప్పు చేసిన రేవంత్ రెడ్డిపై చంద్రబాబు చర్యలెందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ఏపీ పారిశ్రామకవేత్తలు, సినీ పెద్దలు సైతం కేసీఆర్ పాలనను మెచ్చుకుంటున్నారని ఆయన అన్నారు. శాంతి భద్రతలకు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాధాన్య ఇచ్చారని సుమన్ తెలిపారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని ఆయన అన్నారు.
ఓటుకు నోటు కేసు వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు, ఆయన బ్యాండుమేళం నానా కష్టాలు పడుతుందని ఆరోపించారు. దేవుడు అడ్డువచ్చినా చంద్రబాబు తప్పించుకోలేరని, చట్టం చంద్రబాబుకు చుట్టం కాదని, ఏపీలో చంద్రబాబు సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వం కేసుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, అందుకే సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టిందని సుమన్ అన్నారు.












Click it and Unblock the Notifications