తెలంగాణ 'భారం': రేవంత్ రెడ్డికి ఊహించని షాకిచ్చిన చంద్రబాబు
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఊహించని షాకిచ్చారా అంటే అవుననే అంటున్నారు. నిన్న చంద్రబాబు, ఇప్పుడు నారా లోకేష్ తెలంగాణకు పూర్తిగా దూరం జరుగుతున్నట్లుగా కనిపిస్తోందంటున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో చంద్రబాబు.. ముఖ్యమంత్రిగా ఏపీ అభివృద్ధి, రాజకీయాల పైన దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. దీంతో ఆయన పూర్తిగా నవ్యాంధ్రకు పరిమితం అవుతున్నారు. అప్పుడప్పుడు తెలంగాణ టిడిపి నేతలు ఆయనతో భేటీ అవుతున్నారు.
తాను ఏపీని చూసుకోవాల్సిన అవసరం ఉందని వారితో ఆయన సమావేశాల్లోను చెప్పారు. అడపాదడపా బహిరంగంగా.. తాను తెలంగాణను చూసుకుంటానని చెప్పినప్పటికీ, అది మాటల వరకేననే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు పూర్తిగా ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టారు.
ఇప్పుడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వంతు వచ్చింది. ఆయన కూడా పూర్తిగా ఏపీకి పరిమితం కానున్నారు. ఇప్పటి దాకా లోకేష్ గుంటూరులో మూడు రోజులు, హైదరాబాదులో నాలుగు రోజులు ఉంటూ ఇరు రాష్ట్రా నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉన్నారు.

ఇప్పుడు పూర్తిగా గుంటూరులోనే అందుబాటులో ఉండాలని చంద్రబాబు.. నారా లోకేష్‌కు సూచించారు. గతంలో తెలంగాణ టిడిపి నేతల సమావేశంలో రేవంత్ రెడ్డి అధ్యక్షులు చంద్రబాబును ఒకటి అడిగారు. మీరు ఏపీ వెళ్తున్నందున.. లోకేష్ ఇరు తెలుగు రాష్ట్రాలను చూసుకోవాలన్నారు. దానికి చంద్రబాబు ఓకే చెప్పారు.
లోకేష్‌ను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని చేసిన ఉద్దేశ్యం కూడా ఏపీ, తెలంగాణలలో పార్టీని బలోపేతం చేసేందుకేనని చెప్పవచ్చు. లోకేష్ కూడా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేశారు.
లోకేష్ ఏపీకే పరిమితం అని, ఆయనను మంత్రిగా చేస్తారని చాలా రోజుల నుంచి ప్రచారం సాగుతోంది. అయితే చంద్రబాబు ఏపీకి పరిమితమైనందున, లోకేష్ ఇరు రాష్ట్రాలను చూసుకోవాల్సిన అవసరం ఉందని, ఆయన తెలంగాణ పైన కూడా దృష్టి పెడతారని టిటిడిపి నేతలు భావించారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు గుంటూరుకే పరిమితం కావాలని లోకేష్‌కు చంద్రబాబు సూచించినట్లుగా తెలుస్తోంది.
తద్వారా రేవంత్ రెడ్డిని, తెలంగాణ టిడిపి నేతలను చంద్రబాబు డిసప్పాయింట్ చేశారని, ఇక తెలంగాణలో టిడిపి బాధ్యతను పూర్తి బాధ్యతలు వారి పైనే వేసినట్లుగా అర్థమవుతోందని అంటున్నారు. నిన్న చంద్రబాబు, ఇప్పుడు లోకేష్ తెలంగాణకు దూరం జరుగుతున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications