బాబు దూకుడు తగ్గించిన రేవంత్ రెడ్డి, ఇక కెసిఆర్ రెండు కళ్ల సిద్ధాంతం!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దూకుడు తగ్గగా, చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇప్పుడు కెసిఆర్‌లో కనిపిస్తోందని అంటున్నారు.
తెలంగాణలో 2019 నాటికి టిడిపి అధికారంలోకి వస్తుందని చంద్రబాబు, ఇతర తెలంగాణ తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఓటుకు నోటు కేసు అనంతరం టిఆర్ఎస్ ప్రభుత్వం పైన చంద్రబాబు దూకుడు తగ్గినట్లుగా చెబుతున్నారు. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు దూకుడు తగ్గినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
గతంలో కెసిఆర్ అంటే చంద్రబాబు ఒంటి కాలి పైన లేచేవారని, ఓటుకు నోటు కేసు అనంతరం ఆ దూకుడు తగ్గిందని అంటున్నారు. గ్రేటర్ ప్రచారంలో ఎక్కడా కూడా చంద్రబాబు గతంలో వలె టిఆర్ఎస్ పైన, కెసిఆర్ పైన ఘాటు పదాలు ఉపయోగించడం లేదంటున్నారు. ఓటుకు నోటు కేసు వల్లే చంద్రబాబు దూకుడు తగ్గించుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.

మరోవైపు, విభజన విషయంలో ఇన్నాళ్లు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని చెప్పగా.. ఇప్పుడు తెలంగాణ సీఎం కెసిఆర్ చెబుతున్నారని కొత్తగా వాదనలు వినిపిస్తున్నాయి. అందుకు గ్రేటర్ హైదరాబాదులోని ఆంధ్రా ఓటర్లు కారణమనే చెప్పవచ్చు.
ఉద్యమం సమయంలో టిఆర్ఎస్ నేతలు, కెసిఆర్ ఆంధ్రా వారి పైన పరుష వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే, టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక.. తెలంగాణలోని, హైదరాబాదులోని అందరూ తమకు సమానమేనని, ఆంధ్రా వారు అయినా తెలంగాణ వారైనా ఒకటేనని కొత్త పల్లవి అందుకున్నారు.
దీనికి టిఆర్ఎస్ నేతలు, కెసిఆర్ కారణం కూడా చెబుతున్నారు. ఉద్యమం సమయంలో తాము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలా మాట్లాడవలసి వచ్చిందని, తెలంగాణ ఏర్పాటయ్యాక తమది ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని, తాము అధికారంలో ఉన్నామని, కాబట్టి అందరూ సమానమని చెబుతున్నారు.
అంతేకాదు, హక్కులు, ఉద్యోగాలు అన్ని విషయాల్లో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. ఇక, మజ్లిస్ పార్టీ విషయంలో మంత్రి కెటిఆర్ ఓ మాట, సీఎం కెసిఆర్ మరోలా మాట్లాడుతున్నారని అంటున్నారు. మజ్లిస్ మతతత్వ పార్టీ అని కెటిఆర్ అంటే, కెసిఆర్.. ఆ అంశాన్ని పక్కకు పెట్టే ప్రయత్నం చేశారు. తద్వారా కెసిఆర్ కూడా చంద్రబాబు దారిలో పలు అంశాల్లో రెండు కళ్ల సిద్ధాంతం అమలు చేస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications