హైద్రాబాద్‌ను చండీగఢ్‌తో పోలుస్తావా, హక్కు లేదు: బాబుకు హరీష్
హైదరాబాద్: భాగ్యనగరాన్ని చండీగఢ్‌తో పోల్చుతూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మాట్లాడటం కుట్రలో భాగమేనని తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గురువారం నాడు అన్నారు. హైదరాబాదుపై ఆధిపత్యం కోసం చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారన్నారు.
మెదక్ జిల్లాలో హరీష్ రావు మాట్లాడారు. హైదరాబాదు తెలంగాణ రాజధాని అని, తెలంగాణలో అంతర్భాగం అని చంద్రబాబుకు తెలియదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు హైదరాబాదు గురించి మాట్లాడుతున్నారన్నారు.
హైదరాబాద్ తెలంగాణ రాజధాని అని విభజన చట్టంలో పేర్కొన్నారని చెప్పారు. కేవలం పదేళ్ల పాటు కార్యాలయాలను నడుపుకునేందుకు ఏపీకి అవకాశమిచ్చారన్నారు. ప్రతి విషయంలోను తెలంగాణకు చంద్రబాబు అడ్డు వస్తున్నారన్నారు.
చివరకు తమ ప్రభుత్వం సమస్యల విషయంలొనూ సహకరించడం లేదని ఆరోపణలు చేస్తున్నారన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరును తెలంగాణ టిడిపి నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.

ఏపీ ప్రజలకు పాలన అందించాల్సిన చంద్రబాబు ఆ విషయాన్నే మరిచిపోయారన్నారు. నిత్యం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి కుట్రలు చేస్తున్నారని, మీ వట్టిసీమ జోలికి మేం వచ్చామా అని ప్రశ్నించారు. తమ ప్రాజెక్టుల విషయం మీకెందుకని బాబును ప్రశ్నించారు.
మీ పాలన మీరు చేసుకుంటే మంచిదన్నారు. తమ జోలికొస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు. హైదరాబాద్ కేవలం పదేళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందే తప్ప, ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి హక్కు ఉండదని బాబు గుర్తుంచుకోవాలన్నారు.
చంద్రబాబు, మంత్రులు, ఆ రాష్ట్ర పాల నా యంత్రాంగం, హైదరాబాద్‌లో ఉండి తెలంగాణపై కుట్రలు చేస్తే ఊరుకోబోమన్నారు. హైదరాబాద్‌లో నివాసమున్న ఏపీ రైతులకు బాబు రుణమాఫీ వర్తింపచేయకుండా మోసం చేశారన్నారు. చంద్రబాబు, తన ఫ్యామిలితో హైదరాబాదులో ఉంటూ ఏపీని పాలిస్తున్నారన్నారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని బాబు విమర్శించడం సిగ్గుచేటన్నారు. తెలంగాణలోని పాలమూరు, డిండి ప్రాజెక్టులకు గత ప్రభుత్వాల హయాంలోనే అనుమతులు వచ్చాయని, ఇప్పుడు అనుమతులు లేవంటూ అడ్డుకునేందుకు కేంద్రానికి బాబు లేఖ రాయడం దుర్మార్గమన్నారు.
ఏపీలో పాలన గాడితప్పుతున్నందునే ప్రజల దృష్టి తెలంగాణవైపు మళ్లించేందుకే ఇలాంటి కుట్రలు పన్నుతున్నారన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశంతో చేపట్టిన ఆపరేషన్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే చంద్రబాబు ఏసీబీకి దొరికిన విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణకు చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా నంబర్ వన్ రాష్ట్రంగా నిలవడం ఖాయమన్నారు. తెలుగు రాష్ర్టాలు అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలవాలని కేసీఆర్ కోరుకుంటుంటే, చంద్రబాబు మాత్రం తెలంగాణపై కుట్రలు పన్నడమే పనిగా పెట్టుకున్నారన్నారు.












Click it and Unblock the Notifications