చదివింది పదో తరగతే: సాఫ్ట్‌వేర్, మీడియా ప్రతినిధినంటూ 18 బ్యాంకులకు టోకరా
హైదరాబాద్ : ఓ బడా మోసగాడిని పోలీసులు పట్టుకున్నారు. సాఫ్ట్‌వేర్ సంస్థలో టీమ్ లీడర్‌నని, మీడియా ప్రతినిధినని చెబుకుంటూ తప్పుడు గుర్తింపు కార్డులు చూపించి 18 జాతీయ, కార్పోరేట్ బ్యాంకులను మోసం చేసిన తమ్మిశెట్టి కాశయ్య అలియాస్ విజయ్‌ను పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు.
రెండేళ్ల కాలంలో 18 బ్యాంకుల్లో డెబిట్ కార్డులు, రెండు బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు సంపాదించి రూ. 25 లక్షలు స్వాహా చేశాడు. అప్పు చేసిన కొన్న కారుకు ప్రెస్ స్ట్రిక్కర్ అతికించుకుని తిరుగుతున్న కాశయ్యను అనుమానం వచ్చి పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తాను ఏ మీడియా సంస్థలోనూ పనిచేయడం లేదని, మోసాలు చేసేందుకు ప్రెస్ స్ట్రిక్కర్ అతికించుకున్నానని చెప్పాడు.
హైదరాబాదులోని పంజగుట్ట ఎసిపి అతని ఇంటికి వెళ్లి సోదా చేశారు. 25 డెబిట్ కార్డులు, రెండు క్రెడిట్ కార్డులు, పది చెక్ బుక్కులు, 18 సిమ్ కార్డులు, రెండు సెల్‌ఫోన్లు సోదాలో దొరికాయి. రెండు మారుతి ఎర్టిగా కార్లను కూడా స్వాధీనం చేసుకున్నామని డిసిపి వెంకటేశ్వర రావు చెప్పారు.
ప్రకాశం జిల్లాకు చెందిన కాశయ్య (38) పదో తరగతి దాకా చదివాడు. తండ్రి సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేశారు. కాశయ్య చిన్న చిన్న పనులు చేస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. హైదరాబాదుకు వచ్చి డ్రైవింగ్ నేర్చుకున్నాడు. మూడేళ్ల పాటు డ్రైవర్‌గా పనిచేశాడు.

ఆ తర్వాత అతను నేరాల చరిత్ర ప్రారంభమైంది. కార్లు కొనేందుకు యజమానులు రుణాలు తీసుకునే పద్ధతిని జాగ్రత్తగా పరిశీలించాడు. రెండేళ్ల క్రితం పని మానేశాడు. చింతల్‌లో ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. తన పేరుతో కాకుండా విజయ్, సుశాంత్, అమర్, మురళి పేర్లతో ముందుగా ఓటరు కార్డులు సంపాదించాడు. వాటి సాయంతో పాన్ కార్డులు పొందాడు.
ఆ తర్వాత హైదరాబాదులోని వేర్వేరు ప్రాంతాల్లో ఆంధ్రా బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి, కరూర్ వైశ్యా బ్యాంక్ తదితర బ్యాంకుల్లో ఖాతాలు తెరిచాడు. ఆయన పేర్లకు సంబంధించి సాఫ్ట్‌వేర్ టీమ్ లీడర్ హోదాలో నెలకు రూ.60 నుంచి లక్ష రూపాయల వరకు జీతం వస్తుందని చెప్పి తప్పుడు పత్రాలు సృష్టించి బ్యాంకుల్లో వాయిదాల పద్ధతిలో రుణాలు తీసుకునేవాడు.
వాటితో టీవీలు, బైకులు కొనేవాడు. తొలి వాయిదా కట్టేసి వదిలేసేవాడు. మూడు నెలల క్రితం మూడు బ్యాంకుల నుంచి వేర్వేరుగా మారుతి ఎర్టిగాలను రుణం కింద తీసుకున్నాడు. చివరకు మారుతి కారులో తాత్కాలిక రిజిస్ట్రేషన్‌తో వెళ్తున్న కాశయ్యను అనుమానంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఆతని గుట్టు రట్టయింది.












Click it and Unblock the Notifications